సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా… ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్ వేట మొదలుపెట్టబోతోంది. మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి మొదలయ్యే వన్డేల్లో నెగ్గి.. సిరీస్‌ను గెలవాలన్న కసితో ఉంది. వన్డే జట్టు కెప్టెన్‌గా పగ్గాలందుకున్న కేఎల్ రాహుల్.. ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్ని రాహులే స్వయంగా ప్రకటించాడు. వన్డేల్లో ఎప్పుడూ 4 లేదా ఐదో స్థానంలో బరిలోకి దిగే రాహుల్… గాయం కారణంగా రోహిత్ శర్మ సిరీస్‌కు దూరం కావడంతో… అతడి స్థానంలో ఓపెనర్ అవతారం ఎత్తనున్నాడు.
Read Also: జనవరి 19, బుధవారం దినఫలాలు…
వన్డే సిరీస్‌లో రాహుల్‌కు జతగా ధవన్ లేదా రుతురాజ్ గైక్వాడ్‌లో ఒకరు ఓపెనర్‌గా బరిలోకి దిగుతారు. ఇక మూడో స్థానంలో ఎప్పట్లాగే కోహ్లీ బ్యాటింగ్‌కు దిగబోతున్నాడు. కెప్టెన్సీని వదులుకున్న తర్వాత అయినా కోహ్లీ మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకుంటాడేమో చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పైగా వన్డేల్లో కోహ్లీ సెంచరీ కొట్టి చాలా రోజులైంది. ఈ సిరీస్‌లో అయినా కోహ్లీ ఓ వంద బాదేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ లేదా శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఐదో స్థానంలో, వన్డేల్లోకి అరంగేట్రం చేయబోతున్న వెంకటేశ్ అయ్యర్ ఆరోస్థానంలో ఆడనున్నారు. బౌలర్ల విషయానికొస్తే… బుమ్రా, భువీలతో పాటు మూడో పేసర్‌గా దీపక్ చాహర్ లేదా శార్దూల్ ఠాకూర్ బంతిని అందుకునే అవకాశం ఉంది. స్పిన్ విభాగంలో అశ్విన్, చాహల్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు, టెస్ట్ సిరీస్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న సఫారీ టీమ్… వన్డే సిరీస్‌నూ గెలవాలన్న పట్టుదలతో ఉంది. గత పర్యటనలో టీమిండియా చేతిలో వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.