India vs Japan T20 Broadcast: 2026 ఆసియా క్రీడలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో టీమిండియా ఓ చారిత్రాత్మక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. భారత పురుషుల క్రికెట్ జట్టు తొలిసారిగా జపాన్‌తో ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 22న జపాన్‌లోని తోచిగి ప్రిఫెక్చర్‌లో ఉన్న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఇప్పటివరకు భారత్, జపాన్ జట్లు ఏ క్రికెట్ ఫార్మాట్‌లోనూ తలపడలేదు. దాంతో ఈ మ్యాచ్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ మ్యాచ్‌కు బ్రాడ్‌కాస్టింగ్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది.
ఈ మ్యాచ్‌కు సంబంధించిన టెలివిజన్ ప్రసార హక్కుల విషయంలో జపాన్ క్రికెట్ అసోసియేషన్ ఇంకా బ్రాడ్‌కాస్టింగ్ భాగస్వామిని ఖరారు చేయలేదని సమాచారం. ఆసియా క్రీడల ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందు ఈ మ్యాచ్ జరగడం వల్ల లాజిస్టిక్స్, ప్రసార ఏర్పాట్లు క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. జపాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రసార హక్కుల కోసం ఐటీడబ్ల్యూ యూనివర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు ఐటీడబ్ల్యూ సంస్థ స్టార్, సోనీ, జీ వంటి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. టీవీ డీల్ తుది దశకు చేరకపోతే.. ఈ చారిత్రక మ్యాచ్‌ను చివరకు యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారట .
భారత్‌లో ఈ మ్యాచ్ ప్రసారానికి ఫ్యాన్‌కోడ్ రేసులో ఉన్నట్లు సమాచారం. గతంలో జపాన్ క్రికెట్ అసోసియేషన్‌తో ఫ్యాన్‌కోడ్ కలిసి పనిచేసిన నేపథ్యంలో.. టెక్నికల్, ప్రసార పరంగా అది ఒక అవకాశంగా కనిపిస్తోంది. బ్రాడ్‌కాస్టర్లకు అసలు చిక్కు ఏంటంటే.. భారత్ పురుషుల జట్టు జపాన్‌తో మ్యాచ్ ఆడే సమయానికి.. భారత మహిళల క్రికెట్ జట్టు ఆసియా కప్ 2026 ఫైనల్‌లో ఆడే అవకాశం ఉంది. ఆ మ్యాచ్ ఐచి ప్రిఫెక్చర్‌లోని నిషిన్ సిటీలో ఉన్న కొరోగి అథ్లెటిక్ పార్క్‌లో జరగనుంది.
భారత మహిళల జట్టు ఆసియా కప్ 2026 టోర్నీలో ఫేవరెట్‌గా ఉండటంతో.. ఒకేసారి రెండు కీలక మ్యాచ్‌లపై ప్రేక్షకుల ఆసక్తి నెలకొనే అవకాశం ఉంది. దీంతో ప్రసార హక్కులు దక్కించుకునే సంస్థలకు రెండు మ్యాచ్‌లను దాదాపుగా ఒకే సమయంలో కవర్ చేయడం, ప్రత్యేక ప్రసార బృందాలు ఏర్పాటు చేయడం పెద్ద సవాల్‌గా మారవచ్చు. భారత్-జపాన్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌కు క్రీడా పరంగా మాత్రమే కాకుండా.. దౌత్యపరంగానూ ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భారత్, జపాన్ మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘Sport 75’ కార్యక్రమాన్ని ఈ మ్యాచ్‌తో ప్రారంభించనున్నారు. చారిత్రాత్మక మ్యాచ్‌కు ముందు ఈ బ్రాడ్‌కాస్టింగ్ గందరగోళాన్ని నిర్వాహకులు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

