Site icon NTV Telugu

T20 World Cup: నేడు బంగ్లాదేశ్‌తో టీమిండియా కీలక మ్యాచ్.. వరుణుడు సహకరిస్తాడా?

Team India

Team India

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో నేడు మరో కీలక సమరానికి టీమిండియా సిద్ధమైంది. అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అన్ని రంగాల్లో విఫలమైన రోహిత్ సేన పుంజుకుని బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆడాల్సి ఉంటుంది. అయితే వరుణుడు ఎంతమేర సహకరిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. బంగ్లాదేశ్ జట్టుపై టీ20ల్లో టీమిండియాకు మంచి రికార్డే ఉన్నప్పటికీ.. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఓడించినంత పనిచేసింది. అయితే టీమిండియా ముందు బంగ్లాదేశ్ చాలా బలహీనంగా కనిపిస్తోంది. అంతమాత్రాన ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం.

Read Also: Kamal Movie Crazy Update: క్రేజీ అప్డేట్.. భారతీయుడు-2లో క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి

అటు అడిలైడ్ వేదిక అనగానే టీమిండియా కలవరపడుతోంది. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది. అంతేకాకుండా ఇదే వేదికలో 2015 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు బంగ్లాదేశ్ షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 15 పరుగులతో బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించింది. అయితే ఈ వేదికలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి సూపర్ రికార్డు ఉంది. గతంలో అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో ఏకైక టీ20 మ్యాచ్ ఆడిన భారత్ 37 పరుగులతో విజయం సాధించింది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఇదే జరిగితే పాకిస్థాన్ ఆడే మ్యాచ్ ఫలితాలపై భారత్ ఆధారపడాల్సి ఉంటుంది.

Exit mobile version