IND vs AFG Schedule: భారత్‌, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్?

Ind Vs Afg Schedule 2026

Ind Vs Afg Schedule 2026

IND vs AFG 2026 Schedule: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు షెడ్యూల్ ఖరారు అయింది. సెప్టెంబర్‌లో భారత పర్యటనకు టీమిండియా రానున్నట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ధ్రువీకరించింది. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు టీ20 సిరీస్ జరగనుంది. మూడు మ్యాచ్‌లూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి. భారత పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను తమ వాణిజ్య భాగస్వాములు, సంబంధిత సంస్థలకు ఏసీబీ లేఖ ద్వారా తెలియజేసింది.

భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 13న జరగనుంది. రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనుంది. మూడు మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియమే వేదిక కానుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన తేదీలు, వేదికలను బీసీసీఐతో చర్చించి ఖరారు చేసినట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు సిరీస్ జరగనున్నట్లు ఏసీబీ సీఈఓ నసీబ్ ఖాన్ ధ్రువీకరించారు. బీసీసీఐతో తేదీలు, వేదికలపై అంగీకారం కుదిరిందని కూడా వెల్లడించారు.

అయితే ఈ సిరీస్‌పై అభిమానులకు అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉందని ఏసీబీ స్పష్టం చేసింది. మీడియా హక్కుల సంస్థలు, ఇతర భాగస్వాములు ముందస్తు ఏర్పాట్లు చేసుకునేందుకు షెడ్యూల్‌ను అధికారికంగా తెలియజేసినట్లు పేర్కొంది. ఈ సిరీస్‌లో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. విదేశీ క్రికెట్ బోర్డు భారత్‌లోనే టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. సాధారణంగా భారత జట్టు స్వదేశంలో ఆడే సిరీస్‌లను బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటుంది. అయితే ఈసారి అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్‌కు ఆతిథ్య బాధ్యతలు తీసుకుంది.

అఫ్గానిస్థాన్‌తో సిరీస్ ఖరారు కావడంతో సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ సిరీస్ జరిగే అవకాశాలు పూర్తిగా తగ్గినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి 13 వరకు భారత్‌తో ఆరు మ్యాచ్‌ల వైట్‌బాల్ సిరీస్ నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావించినట్లు సమాచారం. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆ సిరీస్‌పై అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం భారత్-అఫ్గానిస్థాన్ మూడు టీ20ల సిరీస్‌కు తేదీలు, వేదికలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 13న ఢిల్లీలో తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుండటంతో.. ఇరు జట్ల అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత జట్ల వివరాలు, మ్యాచ్ సమయాలపై మరింత స్పష్టత రానుంది.