Site icon NTV Telugu

India U19 Team History: వరల్డ్‌కప్‌లో భారత్‌ సరికొత్త చరిత్ర.. తొలి జట్టుగా రేర్ రికార్డు!

India U19 Team History

India U19 Team History

అండర్‌-19 వరల్డ్‌కప్‌ చరిత్రలో భారత జట్టు మరో అరుదైన ఘనత సాధించింది. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో 350+ స్కోర్ నమోదు చేసిన తొలి జట్టుగా భారత్‌ రికార్డుల్లో నిలిచింది. 2026 అండర్‌-19 ప్రపంచప్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ 411/9 పరుగులు చేయడంతో ఈ రికార్డు యువ భారత్ ఖాతాలో చేరింది. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ చేసిన రికార్డు ఇదివరకు భారత్‌ ఖాతాలోనే ఉండడం విశేషం. 2016 అండర్‌-19 వరల్డ్‌కప్ క్వార్టర్‌ఫైనల్‌లో నమీబియాపై భారత్‌ 349/6 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 96 బంతుల్లో 111 పరుగులు చేశాడు.

ఫైనల్ మ్యాచ్‌ల విషయానికి వస్తే.. ఇప్పటివరకు అత్యధిక స్కోర్ ఆస్ట్రేలియా టీమ్ పేరిట ఉంది. 2024 అండర్‌-19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 253/7 పరుగులు చేసింది. తాజాగా భారత్‌ ఆసీస్ రికార్డును బద్దలు కొట్టింది. 2026 ప్రపంచప్‌ ఫైనల్‌లో 411 పరుగులతో ఫైనల్ స్కోర్ల పరంగానూ ఈ టోర్నీలో కొత్త బెంచ్‌మార్క్ ఏర్పడింది. ఇది భారత్‌కు అండర్‌-19 వరల్డ్‌కప్‌లలో మూడో 400+ స్కోర్ కావడం విశేషం. ప్రపంచంలోని మరే జట్టుకైనా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఒకటి కంటే ఎక్కువ 400+ స్కోర్లు లేవు. ఈ విషయంలో భారత్‌ స్పష్టమైన ఆధిపత్యాన్ని చాటుతోంది.

Also Read: 2026 U19 WC Final: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. ఇంగ్లాండ్‌ ముందు ఊహించని టార్గెట్‌!

ఇక ఛేజింగ్ రికార్డుల విషయానికి వస్తే.. అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు అత్యధిక విజయవంతమైన ఛేజ్ కూడా భారత్‌దే. ఇటీవల సెమీఫైనల్‌లో అఫ్గానిస్తాన్‌పై భారత్‌ 311 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి.. సరికొత్త చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్‌లో యువ ఆటగాళ్ల ధైర్యం, లోతైన లైనప్ ఈ రికార్డులకు కారణంగా నిలిచాయి. మొత్తంగా చూస్తే.. అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భారత్‌ యువ క్రికెటర్లు బ్యాటింగ్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ.. ప్రపంచ క్రికెట్‌ దృష్టిని తమవైపు తిప్పుకుంటున్నారు. టీమిండియాకు ఈ యువ ప్లేయర్స్ భవిష్యత్‌ తారలుగా ఉంటున్నారు.

Exit mobile version