India Legends Enters In Finals After Defeating Australia Legends: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ ఘనవిజయం సాధించింది. ఓపెనర్ నమన్ ఓజా (90 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో.. ప్రత్యర్థి జట్టు కుదిర్చిన లక్ష్యాన్ని ఇండియా లెజెండ్స్ చేధించగలిగింది. ఒక దశలో కీలకమైన వికెట్లు పడిపోవడంతో.. ఇండియా లెజెండ్స్ ఓడిపోతుందేమోనని అంతా అనుకున్నారు. కానీ.. ఓజాతో కలిసి ఆఖర్లో ఇర్ఫాన్ పఠాన్ మెరుపులు మెరిపించడంతో విజయం సాధించగలిగింది. దీంతో.. ఇండియా లెజెండ్స్ జట్టు ఫైనల్స్‌లో అడుగుపెట్టింది.
నిజానికి.. బుధవారమే ఈ మ్యాచ్ పూర్తి అవ్వాల్సింది. కానీ, ఆస్ట్రేలియా లెజెండ్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ కొనసాగుతున్న సమయంలో వర్షం పడటంతో ఆటకు అంతరాయం కలిగింది. వర్షం ఆగిన తర్వాత ఆట తిరిగి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, వర్షం ఎంతసేపటికీ ఆగలేదు. దీంతో, చేసేదేమీ లేక గురువారం ఆటని కొనసాగించారు. వర్షం కారణంగా ఆటని ముగించిన సమయంలో.. ఆస్ట్రేలియా లెజెండ్స్ 17 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. గురువారం మరో 3 ఆడగా.. మొత్తం 20 ఓవర్లలో 171/5 స్కోరు చేసింది. బెన్ డక్ 46 పరుగులతో టాప్ స్కోరర్ నిలిచాడు. చివర్లో చివర్లో కామెరున్ వైట్ (30), బ్రాడ్ హడిన్ (12) రాణించారు.
ఇక 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్‌కు మొదట్లోనే షాక్ తగిలింది. సచిన్ టెండూల్కర్ (10), సురేశ్ రైనా(11) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అయితే.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ (18)తో కలిసి నమన్ ఓజా (62 బంతుల్లో 90 నాటౌట్) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇంతలో యువీ ఔట్ అవ్వడం, ఆ వెంటనే బిన్నీ సహా యూసఫ్ పఠాన్ వెనుదిరగడంతో ఇండియా లెజెండ్స్ కష్టాల్లో పడింది. అప్పుడు వచ్చిన ఇర్ఫాన్ పఠాన్ (12 బంతుల్లో 37 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో.. 19.2 ఓవర్లలో ఇండియా లెజెండ్స్ లక్ష్యాన్ని చేధించింది.