Site icon NTV Telugu

IND vs SA: అదరగొట్టిన అవేశ్‌ఖాన్.. నాలుగో టీ20లో భారత్ ఘనవిజయం

Cric

Cric

దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2–2తో సమం చేసింది. శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్‌ 82 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. మొన్న మూడో టీ20 మ్యాచ్ గెలిచిన భారత కుర్రాళ్లు… నేడు నాలుగో టీ20లోనూ దుమ్మురేపేశారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దినేశ్‌ కార్తీక్‌ (27 బంతుల్లో 55; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించగా, హార్దిక్‌ పాండ్యా (31 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది. అవేశ్‌ ఖాన్‌ (4/18) కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా, చాహల్‌కు 2 వికెట్లు దక్కాయి

యువ పేసర్ అవేశ్ ఖాన్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో సఫారీలను కకావికలం చేశాడు. అవేష్ ఖాన్ 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, 170 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే పరిమితమైంది. అవేశ్ ఖాన్‌కు తోడు చాహల్ (2 వికెట్లు), హర్షల్ పటేల్ (1 వికెట్), అక్షర్ పటేల్ (1 వికెట్) సమయోచితంగా రాణించడంతో టీమిండియా అలవోకగా గెలుపు తీరాలకు చేరుకుంది.

ఛేదనలో దక్షిణాఫ్రికా పూర్తిగా తడబడింది. ఏ దశలోనూ ఆ జట్టుకు మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు కనిపించలేదు. గాయంతో బవుమా (8 రిటైర్డ్‌హర్ట్‌) తప్పుకోగా, డికాక్‌ (14) అనూహ్య రీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రిటోరియస్‌ (0) విఫలం కాగా, ఈ సిరీస్‌లో సఫారీ టీమ్‌కు బలంగా నిలిచిన ముగ్గురు బ్యాటర్లు క్లాసెన్‌ (8), మిల్లర్‌ (9), వాన్‌ డర్‌ డసెన్‌ (20) తక్కువ వ్యవధిలో అవుట్‌ కావడంతో 14 ఓవర్లోనే ఆ జట్టు గెలుపు ఆశలు దాదాపుగా కోల్పోయింది. అవేశ్‌ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడం విశేషం. తర్వాత వచ్చినవారిలో ఎవరూ ప్రభావం చూపలేకపోవడంతో సఫారీ ఓటమి ఖాయమైంది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-2తో సమవజ్జీగా నిలిచింది. ఇక నిర్ణాయక ఐదో టీ20 మ్యాచ్ ఈ నెల 19న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

Exit mobile version