IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!

Rinku Singh India Team

Rinku Singh India Team

Wasim Jaffer Hails Rinku Singh: వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ విఫలమైంది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. సంజు శాంసన్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి పోరాడినా విజయానికి చేరువ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో హిట్టర్ రింకూ సింగ్ లేకపోవడం లోటుగా మారిందని, అతడు ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన జాఫర్.. రింకూ బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశంసించాడు. ముఖ్యంగా ఐదు, ఆరు స్థానాల్లో అతడు అద్భుతంగా ఆడగలడని పేర్కొన్నాడు. బౌలింగ్ చేయలేడనే కారణంతోనే రింకూను జట్టులోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు.

‘బ్యాటర్‌గా చూస్తే రింకూ సింగ్ మిగతా వారికంటే ఎంతో ముందుంటాడు. ఐదు, ఆరు స్థానాల్లో అతడి బ్యాటింగ్ అద్భుతంగా ఉంటుంది. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా. బౌలింగ్ చేయలేడనే కారణంతోనే రింకూ ప్రస్తుతం జట్టులో లేకపోవడం బాధాకరం. రజత్ పాటిదార్ టాప్ ఆర్డర్‌లో ఆడతాడు కాబట్టి.. అతడికి అవకాశం కల్పించడం కష్టమని అర్థం చేసుకోవచ్చు. కానీ రింకూ మాత్రం జట్టులో ఉండాల్సింది. నాలుగో టీ20లో రింకూ ఉండి ఉంటే పక్కాగా గెలిచేవాళ్ళం. అతడు మ్యాచ్‌ను ఒంటిచేత్తో మార్చగల సామర్థ్యం కలిగిన ఆటగాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు’ అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.

రింకూ సింగ్ టీ20 క్రికెట్‌లో ఫినిషర్‌గా మంచి గుర్తింపు సంపాదించాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి దశలో ఒత్తిడిని తట్టుకుని వేగంగా పరుగులు చేయడంలో అతడి ప్రత్యేకత. ఈ ఏడాది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 13 మ్యాచ్‌లు ఆడి 10 ఇన్నింగ్స్‌ల్లో 152 పరుగులు చేశాడు. 25.33 సగటు, 139.44 స్ట్రైక్‌రేట్‌తో ఆడగా.. అత్యధిక స్కోరు 44 నాటౌట్. ఐదు, ఆరు స్థానాల్లో అతడి గణాంకాలు బాగున్నాయి. 22 టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు ఆడిన రింకూ 518 పరుగులు చేశాడు. 43.16 సగటుతో పాటు 156కు పైగా స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఆటగాడు భారీ లక్ష్యాల ఛేదనలో జట్టుకు ఉపయోగపడేవాడని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.

భారత ఆల్‌రౌండర్ నమన్ ధీర్ బౌలింగ్‌పైనా వసీం జాఫర్ స్పందించాడు. అతడితో పూర్తి నాలుగు ఓవర్లు వేయించాలని ఆశించడం అత్యాశ అవుతుందని వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా పవర్‌ప్లే తర్వాత వైవిధ్యమైన బంతులు వేయలేని ఆఫ్‌ స్పిన్నర్లకు భారత్‌లో బౌలింగ్ చేయడం కష్టమని వివరించాడు. ‘వైవిధ్యం లేని ఆఫ్‌ స్పిన్నర్లు పవర్‌ప్లే తర్వాత బౌలింగ్ చేయడం కొంత కష్టమే. రోస్టన్ చేజ్ మాత్రం ఆ పని సమర్థంగా చేస్తున్నాడు. కానీ బంతుల్లో వైవిధ్యం, తెలివైన వ్యూహాలు లేకపోతే భారత్‌లో పరుగులను నియంత్రించడం చాలా కష్టం. అందుకే నమన్ ధీర్‌తో నాలుగు ఓవర్లు వేయించాలని ఆశించడం అత్యాశే’ అని జాఫర్ పేర్కొన్నాడు. ఈ సిరీస్‌లో నమన్ నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసిన్నప్పటికీ.. అతడి ఎకానమీ రేటు 12గా ఉంది. హైదరాబాద్‌లో వేసిన ఒక ఓవర్‌లో 19 పరుగులు సమర్పించగా.. ఇండోర్‌లో మూడు ఓవర్లలో 39 పరుగులు ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసినా పరుగులను నియంత్రించలేకపోయాడు. టీ20 జట్టులో కొనసాగాలంటే నమన్ బ్యాటింగ్ కూడా కీలకమని జాఫర్ అభిప్రాయపడ్డాడు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో అతడు 14 పరుగులే చేయడంతో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడని పేర్కొన్నాడు. వేగంగా 25-30 పరుగులు చేయగల సామర్థ్యం అతడికి ఉందని, ఆల్‌రౌండర్‌గా తన విలువను నిరూపించుకోవాలని సూచించాడు.