Site icon NTV Telugu

IND vs SA: రెండో టెస్ట్‌కు శుభ్‌మాన్ గిల్ దూరమైతే.. నంబర్ 4 స్థానంలో ఎవరు ఆడతారు?

Shubman Gill

Shubman Gill

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌ మెడ గాయం బారిన పడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక బంతిని ఎదుర్కొన్న తర్వాత రిటైర్ అయ్యాడు. రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు. మెడ గాయం ఎక్కువ కావడంతో వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. గిల్ లేని లోటు భారత జట్టుపై ఇట్టే కనిపించింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా భారత్ ఛేదించలేకపోయింది. 30 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. కెప్టెన్ గిల్ ఇప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

శుభ్‌మాన్ గిల్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా ఫిట్‌నెస్ గురించి అనుమానాలు నెలకొన్నాయి. శుభ్‌మాన్ విషయంలో రాబోయే 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గిల్‌ విషయంలో తొందరపడకూడదని, వైద్యులతో సంప్రదించిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాయి. గిల్‌ రెండవ టెస్ట్‌లో ఆడగలడా లేదా అనేది ప్రస్తుతం చెప్పడం కష్టమని, కానీ తదుపరి మెడికల్ స్కాన్ నివేదిక వచ్చిన తర్వాత పరిస్థితి మరింత స్పష్టంగా తెలుస్తుందని చెప్పాయి. అవసరమైతే గిల్‌కు పూర్తి విశ్రాంతి ఇస్తామని చెప్పుకొచ్చాయి.

Also Read: Nothing Phone 3a Lite Launch: మనీ రెడీ చేసుకోండమ్మా.. నథింగ్ నుంచి చౌకైన స్మార్ట్​ఫోన్, ఫుల్ డీటెయిల్స్ ఇవే!

రెండో టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22 నుండి గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో ఆరంభం కానుంది. గిల్ గౌహతి టెస్ట్‌కు దూరమైతే రిషబ్ పంత్ భారత జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడు. కోల్‌కతా టెస్ట్‌లో పంత్ స్టాండింగ్ కెప్టెన్‌గా పనిచేశాడు. రెండో టెస్ట్‌కు గిల్ దూరమైతే 4వ స్థానంలో ఎవరు ఆడుతారు? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్ బలమైన పోటీదారులుగా ఉన్నారు. గౌహతి టెస్ట్‌లో వీరిలో ఎవరినైనా నాలుగో స్థానంలో ఆడించవచ్చు. సాయి ఐదు టెస్టుల్లో 30.33 సగటుతో 273 పరుగులు చేశాడు. వాటిలో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. పడిక్కల్ మూడు ఇన్నింగ్స్‌లలో 30.00 సగటుతో 90 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. సాయి, పడిక్కల్ ఇద్దరు ఒకేలా టెస్ట్ రికార్డులను కలిగి ఉన్నారు కాబట్టి ఎవరు ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Exit mobile version