మరికాసేపట్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్రొటీస్ కెప్టెన్ టెంబా బావుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తమ బ్యాటర్లు మంచి ఫామ్ మీదున్నారని, అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నానని బావుమా చెప్పాడు. పిచ్ కాస్త పొడిగా కనిపిస్తోందని, మొదటి ఇన్నింగ్స్‌లో పరుగులు చాలా కీలకం అని పేర్కొన్నాడు. కగిసో స్థానంలో కార్బిన్ ఆడుతున్నడని బావుమా చెప్పాడు.
ఫాస్ట్ బౌలర్లకు పిచ్ సహకరించనుందని టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ చెప్పాడు. తమ ప్లేయర్స్ మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నారని, తమకు ఈ టెస్ట్ సిరీస్ చాలా ముఖ్యం అని పేర్కొన్నాడు. నితీష్ రెడ్డి స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి వచ్చాడని, అక్షర్ పటేల్ కూడా తిరిగి టీంలోకి వచ్చాడని గిల్ తెలిపాడు. అయితే బ్యాటింగ్‌లో కీలకమైన మూడో స్థానంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ రానున్నాడు. గత సిరీస్‌లో సాయి సుదర్శన్ ఈ స్థానంలో ఆడాడు. ఈ టెస్టులో కూడా అతడే అని అందరూ అనుకున్నారు. కానీ కోచ్ గౌతమ్ గంభీర్ అందరికి షాక్ ఇచ్చాడు.
భారత్ ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లతో బరిలోకి దిగింది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా నాలుగు నెలలు ఆటకు దూరమైన విషయం తెలిసిందే. దేశవాళీల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న కీపర్ ధ్రువ్ జురెల్‌కు సైతం ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది. భారత్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది.
Also Read: IPL 2026 Auction Date: ఐపీఎల్ మినీ వేలం తేదీ ఇదే.. వరుసగా మూడో సంవత్సరం..!
తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
దక్షిణాఫ్రికా : ఐడెన్ మార్క్‌రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్(వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్.
