Pakistan will come to India after 7 Years for World Cup 2023: భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది. అహ్మదాబాద్‌లో అక్టోబరు 5న మెగా సమరం ఆరంభం అయి.. నవంబరు 19న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ప్రపంచకప్ 2023లో 45 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు, 2 నాకౌట్ మ్యాచ్‌లు (సెమీ ఫైనల్స్), ఒక ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 48 మ్యాచ్‌లకు భారత్‌లోని 10 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం భారత్ సహా అన్ని దేశాల ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అక్టోబరు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తన ప్రపంచకప్ 2023 పోరాటాన్ని ప్రారంభిస్తుంది. అక్టోబర్ 11న ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. ఇక ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబర్ 15న మ్యాచ్ జరగనుంది. దాయాది జట్లు ప్రపంచంలోనే అత్యధిక కెపాసిటీ ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ప్రపంచకప్ 2023 కోసం పాకిస్తాన్ జట్టు ఏడేళ్ల విరామం తర్వాత భారత్‌లో అడుగుపెట్టనుంది.
పాకిస్థాన్ చివరిసారిగా టీ20 ప్రపంచకప్ 2016 కోసం భారత్ గడ్డపైకి వచ్చింది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత పాకిస్థాన్ ఇప్పటివరకు కూడా భారత్‌కు రాలేదు. ప్రపంచకప్ 2023 పుణ్యమాని ఏడేళ్ల తర్వాత భారత గడ్డపైకి అడుగుపెట్టనుంది. ఇరు దేశాల మధ్య బేధాభిప్రాయాల కారణంగా గత కొంత కాలంగా భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే దాయాది దేశాలు తలపడుతున్నాయి.
2016 టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 18 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (26), అహ్మద్ షెహజాద్ (25) టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో సురేష్ రైనా, రవీంద్ర జడేజా, ఆశిష్ నెహ్రా తలో వికెట్ పడగొట్టారు. 119 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో పూర్తిచేసింది. విరాట్ కోహ్లీ (55 నాటౌట్) హాఫ్ సెంచరీ బాదాడు. మొహ్మద్ సమీ 2 వికెట్స్ పడగొట్టాడు.
Also Read: Big Pay Hike: టీచర్లకు గుడ్‌న్యూస్.. భారీ వేతన పెంపును ప్రకటించిన సర్కారు!