IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్‌ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

  • ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్‌ మొదటి వన్డే
  • కొత్త ఆరంభం కోసం బరిలోకి టీమిండియా
  • ప్రపంచకప్‌కు సన్నాహకంగా వన్డేల సిరీస్‌
Ind Vs Eng 1st Odi 2026

Ind Vs Eng 1st Odi 2026

IND vs ENG 1st ODI 2026: ఇంగ్లండ్‌లో ఇటీవల తీవ్ర ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించిన చల్లని ఈశాన్య గాలుల మాదిరిగానే.. భారత జట్టు కూడా విజయాల గాలి తమవైపు వీయాలని ఎదురుచూస్తోంది. మంగళవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే తొలి వన్డేలో టీమిండియా కొత్త ఆరంభం కోసం బరిలోకి దిగుతోంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ మూడు వన్డేల సిరీస్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.

కోహ్లీ, రోహిత్‌ వచ్చేశారు:
ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన టీ20 సిరీస్‌లలో వరుసగా ఆరు పరాజయాలు చవిచూసిన భారత జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ పరాజయాల నుంచి బయటపడేందుకు వన్డే సిరీస్‌ను అవకాశంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. టీ20ల్లో విశ్రాంతి తీసుకున్న సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సహా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మళ్లీ జట్టులో చేరడంతో భారత జట్టు బలంగా మారింది. అందరి దృష్టి కోహ్లీపైనే నిలిచింది. మే 31న జరిగిన ఐపీఎల్ ఫైనల్ తర్వాత కింగ్ మైదానంలో కనిపించలేదు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన స్వదేశీ వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో తిరిగి జట్టులోకి రావడం భారత అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

బుమ్రా దిగుతున్నాడు:

భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా చాలా కాలం తర్వాత వన్డేల్లో బరిలోకి దిగనున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ అనంతరం అతడు వన్డే మ్యాచ్ ఆడలేదు. కీలక టోర్నమెంట్లను దృష్టిలో పెట్టుకుని బుమ్రా పనిభారాన్ని బీసీసీఐ జాగ్రత్తగా నిర్వహిస్తోంది. అతడి పునరాగమనం భారత బౌలింగ్ దళానికి పెద్ద బలం కానుంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్‌పైనా ప్రత్యేక దృష్టి ఉంది. ఇటీవల టీ20 కెప్టెన్‌గా వరుసగా ఆరు పరాజయాలు ఎదుర్కొన్న అతడు.. ఆ నిరాశను అధిగమించి వన్డేల్లో రాణించాల్సిన అవసరం ఉంది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 20 నాటౌట్, 26, 12 పరుగులు మాత్రమే చేసిన అయ్యర్.. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ సిరీస్‌లో తన ఫామ్‌ను తిరిగి నిరూపించుకోవాలని భావిస్తున్నాడు.

వన్డేల్లో ఇంగ్లండ్ తడబాటు:

టీ20 సిరీస్‌లో భారత్‌ను 4-0తో చిత్తు చేసిన ఇంగ్లండ్.. వన్డేల్లో మాత్రం గత కొంతకాలంగా ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. జనవరిలో శ్రీలంకపై 2-1తో సిరీస్ గెలిచిన తర్వాత ఇంగ్లండ్ ఒక్క వన్డే కూడా ఆడలేదు. 2023 ప్రపంచకప్‌లో ఏడో స్థానంతో నిరాశపరిచిన తర్వాత ఆ జట్టు ఎనిమిది ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లలో ఆరు కోల్పోయింది. ఇంగ్లండ్ జట్టులోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ అనంతరం న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమి చవిచూడడంతో హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ టెస్టు బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇకపై అతడు పూర్తిగా వైట్‌బాల్ జట్లపైనే దృష్టి సారించనున్నాడు. ప్రపంచకప్‌కు సన్నాహకాల దృష్ట్యా ఈ సిరీస్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది.

జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం:

మొదటి వన్డే మ్యాచ్‌కు వర్షం ముప్పుంది. అయితే మ్యాచ్ రద్దయ్యే అంత ప్రభావం ఉండదని తెలుస్తోంది. బర్మింగ్‌హామ్‌లో పిచ్‌ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. కాబట్టి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం గం.3:30కు మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ మూడు గంటలకు వేయనున్నారు. ఈ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్‌ చానెల్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

జట్లు:

భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్.
ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రేహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, జాకబ్ బెతెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహ్మూద్, ఆదిల్ రషీద్, జో రూట్, జోష్ టంగ్.