Site icon NTV Telugu

ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో సంచలనం.. కింగ్ కోహ్లీని దాటేసిన డారిల్ మిచెల్!

Daryl Mitchell Record

Daryl Mitchell Record

ఇటీవల భారత్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ ప్రపంచ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. తాజా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి.. నంబర్‌వన్ స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం మిచెల్ ఖాతాలో 845 పాయింట్లు ఉన్నాయి. ఇంతకుముందు మొదటి స్థానంలో ఉన్న కింగ్ కోహ్లీ 795 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.

వరుసగా రెండు సెంచరీలతో సిరీస్‌ను శాసించిన డారిల్ మిచెల్.. భారత్ గడ్డపై న్యూజిలాండ్‌కు తొలి వన్డే సిరీస్ విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో కలిపి 352 పరుగులు చేసిన మిచెల్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఆ అద్భుత ఫామ్‌నే తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అతడిని అగ్రస్థానానికి చేర్చింది. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం.. మిచెల్‌కు 845 రేటింగ్ పాయింట్లు ఉండగా, విరాట్ కోహ్లీకి 795 పాయింట్స్ ఉన్నాయి.

Also Read: Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్.. రేసులో ఇద్దరు బడా హీరోలు?

ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ కూడా నిరాశపరచలేదు. మూడు మ్యాచ్‌ల్లో 240 పరుగులు చేసి రెండో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే మిచెల్ సూపర్ ఫామ్ కారణంగా కోహ్లీ కేవలం వారం రోజుల్లోనే తన నంబర్‌వన్ స్థానాన్ని కోల్పోయాడు. 2021 తర్వాత తొలిసారి అగ్రస్థానం సాధించిన కోహ్లీకి ఇది నిరాశపరిచే అంశమే. తాజా ఐసీసీ వన్డే బ్యాటర్ల టాప్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్‌కు చెందిన ఇబ్రాహీం జద్రాన్ (764), భారత కెప్టెన్ రోహిత్ శర్మ (757), టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (723), పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజమ్ (722) ఉన్నారు. అలాగే హ్యారీ టెక్టర్, షై హోప్, చరిత్ అసలంక, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, ట్రావిస్ హెడ్, క్వింటన్ డికాక్ లు బ్యాటర్లు టాప్ 20లో చోటు దక్కించుకున్నారు.

Exit mobile version