ఐసీసీ వన్డే, టెస్ట్ టీమ్ ఆఫ్ 2022ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. వన్డే టీమ్‌లో ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్‌కు చోటు దక్కగా.. టెస్టు జట్టులో కేవలం ఒక్క ప్లేయర్ మాత్రమే ఉన్నాడు. కాగా వన్డే జట్టుకు పాకిస్థాన్ సారథి బాబర్ అజామ్, టెస్టు టీమ్‌కు ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్‌ను కెప్టెన్‌గా ఐసీసీ నియమించింది. వన్డే జట్టు మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌లకు చోటు దక్కింది. ఇక న్యూజిలాండ్ నుంచి ఇద్దరు, వెస్టిండీస్ నుంచి ఇద్దరు, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు, జింబాబ్వే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఒక్కొక్కరికి అవకాశం లభించింది. గతేడాది వన్డేల్లో అత్యుత్తమంగా రాణించిన ప్లేయర్స్‌ను ఐసీసీ ఈ టీమ్ కోసం ఎంపిక చేసింది. ఇండియా తరఫున 2022లో నిలకడగా ఆడుతూ వచ్చిన శ్రేయస్ అయ్యర్.. మిడిలార్డర్‌లో నమ్మదిగన బ్యాటర్‌గా ఎదిగాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 17 వన్డేల్లో 724 రన్స్ చేశాడు. అతని సగటు 55 కాగా.. ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు. మహ్మద్ సిరాజ్ కూడా ఈ వన్డే టీమ్ ఆఫ్ 2022లో చోటు దక్కించుకున్నాడు. గతేడాది బుమ్రా గాయం కారణంగా చాలా వరకూ టీమ్‌కు దూరంగా ఉండటంతో ఆ అవకాశాన్ని సిరాజ్ సద్వినియోగం చేసుకున్నాడు. సిరాజ్ 15 వన్డేల్లో 24 వికెట్లు తీశాడు. అతని సగటు 23కాగా.. ఎకానమీ రేటు 4.62 మాత్రమే.
టెస్టు టీమ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ సారథ్యంలో మొత్తం 11మందితో జట్టును ఐసీసీ అనౌన్స్ చేసింది. ఇందులో ఒకే ఒక్క ఇండియన్ ప్లేయర్‌కు అవకాశం రావడం గమనార్హం. గతేడాది టెస్టుల్లో అద్భుత పెర్ఫామెన్స్ చేసిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు మాత్రమే టెస్టు టీమ్‌లో చోటిచ్చారు, కాగా, ఓపెనర్లుగా ఖవాజా, బ్రాత్‌వైట్‌కు అవకాశం కల్పించగా.. మూడు, నాలుగు స్థానాల్లో లబుషేన్, బాబర్ అజామ్ ఎంపికయ్యారు. అనంతరం మిడిల్‌లో బెయిర్ స్టో, స్టోక్స్, రిషభ్ పంత్ ఉన్నారు. కమిన్స్, రబాడ, లియోన్, అండర్సన్‌లను బౌలర్లుగా ఎంపిక చేశారు. ఈ టీమ్‌లో చోటు దక్కించుకున్న పంత్.. నిరుడు 12 ఇన్నింగ్స్‌ల్లో 90.09 యావరేజ్‌తో 680 రన్స్ చేసి సత్తాచాటాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే కీపర్‌గా 23 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ 2022
బాబర్ అజామ్ (కెప్టెన్), ట్రెవిస్ హెడ్, షై హోప్, టామ్ లాథమ్, శ్రేయస్ అయ్యర్, సికిందర్ రజా, మెహదీ హసన్, అల్జారీ జోసెఫ్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, మహ్మద్ సిరాజ్.
ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ 2022
ఉస్మాన్ ఖవాజా, క్రేగ్ బ్రాత్‌వైట్, లబుషేన్, బాబర్ అజామ్, బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), కమిన్స్, రబాడ, నాథన్ లియోన్, జేమ్స్ అండర్సన్