NTV Telugu Site icon

India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ క్రేజ్ మమూలుగా లేదుగా.. రూ.1 లక్ష దాటిన హోటల్ ధరలు..

Ind Vs Pak

Ind Vs Pak

India vs Pakistan: వన్డే వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఐసీసీ ఖరారు చేసింది. అయితే అందరి కళ్లు మాత్రం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పైనే కేంద్రీకృతం అయ్యాయి. చాలా రోజుల తర్వాత మరోసారి దాయాదుల మధ్య సమరం క్రికెట్ లవర్స్ కి కిక్ ఇవ్వబోతోంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా ఈ క్రికెట్ వార్ జరగబోతోంది. ఫైనల్ మ్యాచ్, భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ తో సహా 5 మ్యాచులకు అహ్మదాబాద్ వేదిక కాబోతోంది.

ఇదిలా ఉంటే టోర్నీ ప్రారంభం కావడానికి మరో మూడు నెలలు సమయం ఉంది. ఐనా కూడా అహ్మదాబాద్ నగరంలో చిన్న హోటళ్ల నుంచి స్టార్ హోటళ్ల దాకా రూమ్స్ బుక్ అవుతున్నాయి. హోటల్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏకంగా హోటల్ ధరలు రూ. 1 లక్షలను దాటాయి. హోటల్ గదుల రేట్లు దాదాపుగా 10 రెట్లు పెరిగాయి.

Read Also: Manipur: రాజీనామాపై వెనక్కి తగ్గిన సీఎం బీరెన్ సింగ్.. తాను రాజీనామా చేయనని ట్వీట్..

ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ఉండటంతో అభిమానులు ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. వివిధ హోటల్ బుకింగ్ వెబ్‌సైట్‌లలోని రేట్లు పెరిగాయి. డిమాండ్ కారణంగా మరింతగా రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. నగరంలోని కొన్ని లగ్జరీ హెటళ్లు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో వీటి అద్దె రోజుకు రూ. 5,000 నుంచి రూ.8,000 మధ్య ఉంటుంది. అలాంటిది ఇప్పుడు రేట్లు లక్షను మించాయి.

ఫైనల్‌తో సహా ఐదు ప్రపంచకప్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. నగరంలో తక్కువ వ్యవధిలో భారీ క్రికెట్ మ్యాచ్‌లు జరగడం ఇదే తొలిసారి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథుల కోసం నగరంలో 10,000 గదులు అందుబాటులో ఉన్నాయి. అయితే లక్ష మంది కెపాసిటీ కలిగిన నరేంద్రమోడీ స్టేడియలో 40,000 మంది అభిమానులు నగరానికి వస్తారని అంచనా. దీంతో డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా నగరంలోని అన్ని లగ్జరీ హోటళ్లలో అక్టోబర్ 15 వరకు గదులు అందుబాటులో లేవు. గుజరాత్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేంద్ర సోమాని మాట్లాడుతూ.. ఈ పెద్ద ఈవెంట్ కోసం లగ్జరీ హోటళ్లలో రూమ్స్ బ్లాక్ చేశారు. దీంతో లగ్జరీ హోటళ్లలో ధరలు పెరిగాయని చెప్పారు.