ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యా.. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. ఒకే మ్యాచ్‌లో అర్థశతకం సాధించడంతో పాటు మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన రెండో భారత ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు 2009-10లో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. 25 బంతుల్లోనే 60 పరుగులు చేయడంతో పాటు 3 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత హార్దిక్ పాండ్యా ఆ ఫీట్‌ని తిరగరాశాడు. 33 బంతుల్లో 51 పరుగులు చేసిన అతడు, 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
ఇక మ్యాచ్ వివరాలకొస్తే.. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఒక్క ఇషాన్ కిషన్ మినహా.. మిగతా ఆటగాళ్లందరూ దూకుడుగా రాణించారు. ముఖ్యంగా.. హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 33 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగులు చేసింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆటగాళ్లను భారత బౌలర్లు మొదట్నుంచే కట్టడి చేశారు. ఎవ్వరికీ ఆడే ఛాన్స్ ఇవ్వలేదు. మోయీన్ అలీ, క్రిస్ జోర్డాన్ మాత్రమే కాస్త మెరుపులు మెరిపించారు. మిగిలిన వాళ్లు వెనువెంటనే పెవిలియన్ చేశారు. దీంతో 148కే ఇంగ్లండ్ కుప్పకూలడంతో.. 50 పరుగుల తేడాతో భారత్ మ్యాచ్ కైవసం చేసుకొని, సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో ఉంది.