NTV Telugu Site icon

IND Vs ENG: ఐదో టెస్టులో భారత్ ఓటమి.. టెస్ట్ సిరీస్ సమం

England

England

బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్ టెస్టులో టీమిండియా చేతులారా ఓటమిని కొని తెచ్చుకుంది. ముఖ్యంగా నాలుగో రోజు బౌలింగ్ వైఫల్యం జట్టు కొంప ముంచింది. దీంతో 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను టీమిండియా బౌలర్లు ఏ విధంగానూ ఇబ్బందిపెట్టలేకపోయారు. ఓపెనర్లు అలెక్స్ లీస్ (56), జాక్ క్రాలీ (46) సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి నాంది పలికారు. అయితే రెండు పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయినా రూట్ (142 నాటౌట్), జానీ బెయిర్ స్టో (114 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో భారీ లక్ష్యంలా కనిపించిన టార్గెట్ కర్పూరంలా కరిగిపోయింది.

Read Also: Megastar Chiranjeeevi: పేరు మార్చుకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే..?

భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీశాడు. మిగతా బౌలర్ల నుంచి టీమిండియా కెప్టెన్‌కు సహకారం లభించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 416 పరుగులు చేయగా ఇంగ్లండ్ 284 పరుగులకు ఆలౌటైంది. 132 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా తడబాటుకు గురైంది. శుభ్‌మన్ గిల్ (4), హనుమా విహారి (11), విరాట్ కోహ్లీ (20) విఫలమయ్యారు. అయితే చతేశ్వర్ పుజారా (66), పంత్ (57) రాణించడంతో కోలుకున్నట్లు కనిపించిన భారత్ వాళ్లిద్దరూ అవుట్ కాగానే వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ (19), జడేజా (23) శార్దూల్ ఠాకూర్ (4) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. దీంతో 284 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 378 పరుగుల టార్గెట్ నిలిచింది. కాగా ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమమైంది. దీంతో 2007 తర్వాత ఇంగ్లండ్‌లో సిరీస్ గెలవాలన్న టీమిండియా కల నెరవేరలేదు.