రంజీ ట్రోఫీలో భాగంగా బెంగాల్, జార్ఖండ్‌ల మధ్య జరిగిన క్వారర్ ఫైనల్ మ్యాచ్ శుక్రవారం డ్రాగా ముగిసింది. ఆఖరి రోజు ఫలితం వచ్చేలా కనిపించకపోవడంతో అంపైర్లు గంట ముందుగానే మ్యాచ్‌ను నిలిపివేసి డ్రాగా ప్రకటించారు. ఆట ముగిసే సమయానికి బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ సెంచరీ చేయడం విశేషం. 129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బెంగాల్‌ను మనోజ్ తివారీ తన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో మనోజ్ తివారీ 152 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 136 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ మనోజ్ తివారీ 73 పరుగులు చేసింది. తివారీ పోరాటంతో బెంగాల్ డ్రాతో గట్టెక్కింది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌ను 773 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 298 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగాల్‌కు 475 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన బెంగాల్ జట్టు సెమీఫైనల్‌కు వెళ్లింది. జూన్ 14-18 మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్లో బెంగాల్, మధ్యప్రదేశ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మరో సెమీఫైనల్లో ముంబై, ఉత్తర్ ప్రదేశ్ తలపడనున్నాయి.
