Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!

  • టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం
  • దిలీప్‌ కాంట్రాక్టును పొడిగించే అవకాశాలు లేవు
  • జింబాబ్వే పర్యటనకు వెళ్లని ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌
T Dilip Fielding Coach

T Dilip Fielding Coach

BCCI to Move On From T Dilip: టీమిండియా సహాయ సిబ్బందిలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌ కాంట్రాక్టును బీసీసీఐ మరోసారి పొడిగించే అవకాశాలు లేవని సమాచారం. ఇంగ్లండ్‌తో జరిగిన వైట్‌బాల్ సిరీస్ అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టుతో ఆయన ప్రయాణించలేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు గణనీయంగా పడిపోవడంతో ఫీల్డింగ్ విభాగంలో కొత్త మార్పులు తీసుకురావాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.

మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ హయాంలో భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా టీ దిలీప్ బాధ్యతలు చేపట్టాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లతో సన్నిహితంగా మెలుగుతూ మంచి గుర్తింపు సంపాదించాడు. ప్రతి మ్యాచ్ అనంతరం అత్యుత్తమ ఫీల్డర్‌కు ‘బెస్ట్ ఫీల్డర్ మెడల్’ అందించే ప్రత్యేక సంప్రదాయాన్ని కూడా ఆయనే ప్రారంభించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత ద్రవిడ్ సహా విక్రమ్ రాథోడ్, పరాస్ మాంబ్రే తమ పదవుల నుంచి తప్పుకున్నప్పటికీ.. దిలీప్ మాత్రం కొనసాగాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆయనకు మరో ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ.. ఇప్పుడు మళ్లీ పొడిగించే అవకాశం లేదని సమాచారం.

టీ దిలీప్ కాంట్రాక్ట్ గడువు ముగిసిపోయిందని క్రీడా జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ పేర్కొన్నాడు. జింబాబ్వే పర్యటనకు ఆయన భారత జట్టుతో వెళ్లడం లేదని, మరోసారి కాంట్రాక్ట్ పొడిగించే అవకాశాలు దాదాపు లేవని రాసుకొచ్చాడు. గత కొంతకాలంగా టీమిండియా ఫీల్డింగ్ తీవ్ర విమర్శలకు గురవుతోంది. 2026 టీ20 ప్రపంచ కప్‌ను గెలిచినప్పటికీ టోర్నీలో భారత్ ఏకంగా 15 క్యాచ్‌లు జారవిడిచింది. టోర్నీలో మనోళ్లే అత్యధిక క్యాచ్‌లు డ్రాప్ చేశారు. అంతేకాదు భారత జట్టు క్యాచ్‌ల సక్సెస్ రేట్ 72 శాతం మాత్రమే నమోదైంది. ఇది కూడా టోర్నీలోనే అత్యల్పం. ఈ సమస్యలు 2025 ఆసియా కప్ నుంచే ప్రారంభమై.. ఇంగ్లండ్ పర్యటనలో కూడా కొనసాగాయి.

ఇంగ్లండ్ పర్యటన అనంతరం భారత జట్టు మూడు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వేకు చేరుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు విశ్రాంతి ఇవ్వడంతో ఈ పర్యటనలో వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. శ్రేయస్ అయ్యర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేశాడు. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్‌లకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. జూలై 23, 25, 26 తేదీల్లో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగే మూడు టీ20లు జరగనున్నాయి.