శ్రీలంక పర్యటనకు ముందు భారత ఆటగాళ్లు గాయపడుతుండటం బీసీసీఐని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమవ్వగా.. మరికొందరు ఫిట్‌నెస్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. దాంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు మెడికల్ స్టాఫ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) పనితీరుపై సమగ్ర సమీక్ష చేపట్టాలని బీసీసీఐ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తాజాగా గాయానికి గురవడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. మరోవైపు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ శ్రీలంక సిరీస్ నుంచి తప్పుకున్నాడు. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ.. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.
ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో కూడా గాయాల సమస్యపై పలుమార్లు చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ర్యాన్ టెన్ డస్కటే, టీ. దిలీప్ నిష్క్రమణ తర్వాత సపోర్ట్ స్టాఫ్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2022 నుంచి భారత జట్టుకు హెడ్ ఫిజియోగా పనిచేస్తున్న కమ్లేష్ జైన్ పనితీరుపై బీసీసీఐ అభిప్రాయాలు సేకరించనున్నట్లు సమాచారం. అలాగే జట్టు వైద్యుడు డాక్టర్ రిజ్వాన్ ఖాన్ బాధ్యతలపై కూడా సమీక్ష జరగనుంది. శ్రీలంక టూర్ అనంతరం ఈ ఇద్దరిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా వరుస గాయాల సమస్యపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి సిరీస్‌కు కీలక ఆటగాళ్లు గాయపడుతుండటంతో అత్యుత్తమ జట్టును ఎంపిక చేయడం కష్టమవుతోందని వారు భావిస్తున్నారట. ఈ కారణంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపైనా విమర్శలు పెరుగుతున్నాయి. కొందరు సీనియర్ ఆటగాళ్లు బీసీసీఐ వ్యవస్థకు బయట ఉన్న నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే మాజీ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ స్థానంలో అడ్రియన్ లె రౌక్స్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫిట్‌నెస్ ఆశించిన స్థాయిలో లేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రతి స్థానానికి తీవ్రమైన పోటీ ఉండటంతో ఆటగాళ్లు తమ శరీరంపై అధిక ఒత్తిడి తెచ్చుకుంటున్నారని.. అలాంటి సమయంలో మెడికల్ స్టాఫ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అప్రమత్తంగా ఉండి అవసరమైతే ‘రెడ్ ఫ్లాగ్’ చూపించాలని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

