NTV Telugu Site icon

Roger Binny: అఫ్రిది వ్యాఖ్యలపై బీసీసీఐ చీఫ్ ఆగ్రహం.. టీమిండియాకు ఐసీసీ ఎలా సహకరిస్తుంది?

Roger Binny

Roger Binny

Roger Binny: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఐసీసీ సహరిస్తోందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన అఫ్రిది వ్యాఖ్యలపై పెదవి విప్పారు. అఫ్రిది చేసిన ఆరోపణలు సమంజసం కాదని అసహనం వ్యక్తం చేశారు. ఐసీసీ టీమిండియాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించడం సరికాదని.. ఐసీసీ అన్ని జట్ల విషయంలో ఒకేలా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఐసీసీ పక్షపాతం చూపిస్తోందని ఎలా అంటారని ప్రశ్నించారు. మిగతా జట్లతో పోలిస్తే టీమిండియా అదనంగా ఎలాంటి సహకారం లభిస్తోందో చూపించాలని సవాల్ విసిరారు. క్రికెట్‌లో భారత్ పవర్ హౌస్ జట్టే.. కానీ ఐసీసీ అన్ని జట్లను సమానంగానే పరిగణిస్తుందని రోజర్ బిన్నీ తెలిపారు.

Read Also: TATA Motors: కార్ల ధరలను పెంచుతూ టాటా కీలక నిర్ణయం..

కాగా టీమిండియా మ్యాచ్‌లలో అంపైర్లు తీసుకున్న నిర్ణయాలు కొన్ని వివాదాస్పదంగా నిలిచాయి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో అంపైర్లు నోబాల్ ఇచ్చారు. అది నోబాల్ కాదని సోషల్ మీడియాలో పాకిస్థాన్ అభిమానులు తెగ కామెంట్లు చేశారు. ఇటీవల బంగ్లాదేశ్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వర్షం పడి మైదానం చిత్తడిగా ఉందని బంగ్లాదేశ్ కెప్టెన్ చెప్పినా అంపైర్లు వినిపించుకోలేదని ఆ జట్టు అభిమానులు ఆరోపించారు. ఇదే మ్యాచ్‌లో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని బంగ్లాదేశ్ ఆటగాడు నురుల్ హసన్ ఆరోపించాడు. ఈ అంశాన్ని గమనించడంలో అంపైర్లు విఫలమయ్యారని.. అంపైర్లు కావాలనే భారత్‌కు సహకారం అందిస్తున్నారని పలువురు బంగ్లాదేశ్ అభిమానులు కోహ్లీని ట్రోల్ చేశారు.