భారత క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వివాదం సద్దుమణుగుతోంది. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సెలక్షన్ కమిటీతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీపై వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అది మరవకముందే గంగూలీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. చివరకు ఈ వివాదం గంగూలీకి రోజులు దగ్గరపడ్డాయని క్రికెట్ అభిమానులు చర్చించుకునే స్థాయికి వెళ్లింది.
అసలు విషయంలోకి వెళ్తే… బీసీసీఐ నిబంధనల ప్రకారం బీసీసీఐ అధ్యక్షుడు టీమ్ సెలక్షన్ కమిటీ సమావేశాలకు వెళ్లకూడదు. అయినప్పటికీ గంగూలీ రెండుసార్లు హాజరయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంలో గంగూలీపై చాలా మంది విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తనకు సంబంధం లేని సెలక్షన్ సమావేశాలకు గంగూలీ ఎందుకు వెళ్తున్నారని కొందరు నిలదీస్తున్నారు. దీంతో బీసీసీఐ రెండుగా చీలింది. గంగూలీ తీరును కొందరు తప్పుబడుతుంటే.. మరికొందరు మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు.
ప్రస్తుతం బీసీసీఐ వ్యవహారాలన్నీ మారిపోయాయని.. అసలు సెలక్షన్ కమిటీ సమావేశాలకు గంగూలీ రావాల్సిన అవసరమేంటని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జై షాతో పాటు గంగూలీపై క్రికెట్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు గంగూలీ ఎప్పుడూ సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరు కాలేదని మరికొందరు అధికారులు చెబుతున్నారు. తాజా వివాదం కారణంగా ఈ ఏడాది అక్టోబర్ వరకు గంగూలీ, జై షా వారి పదవుల్లో కొనసాగాల్సి ఉన్నా.. అప్పటిదాకా ఉంటారా? అన్న చర్చ జరుగుతోంది.
