BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!

Bcci

Bcci

BCCI New Selection Policy: ఇటీవల కాలంలో గాయపడిన ఆటగాళ్ల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక మార్పు చేసినట్లు సమాచారం. ఇకపై ఆటగాడి ఫిట్‌నెస్‌పై పూర్తి నమ్మకం వచ్చే వరకు అతడి పేరును జాతీయ జట్టులో ప్రకటించకూడదనే కొత్త విధానాన్ని బీసీసీఐ అనుసరించనున్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో పలువురు ఆటగాళ్ల పేర్లకు అస్టరిస్క్ మార్క్ పెట్టడం కూడా ఇదే విధానంలో భాగంగా కనిపిస్తోంది.

నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్ల పేర్లకు అస్టరిస్క్ ఉండటం.. వారి ఫిట్‌నెస్‌పై ఇంకా తుది నిర్ధారణ లేదనే సంకేతంగా భావిస్తున్నారు. గత కొన్ని నెలల్లో గాయాలతో బాధపడుతున్న ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత కూడా సిరీస్‌కు ముందు లేదా మధ్యలో పూర్తిగా ఫిట్‌గా లేకపోవడంతో జట్టుకు దూరమైన సందర్భాలు ఉన్నాయి. దీంతో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.

తాజా నివేదికల ప్రకారం.. ఇకపై ఆటగాడిని జట్టులోకి ఎంపిక చేసే సమయంలో అతడు మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడన్న విషయంపై బీసీసీఐ మరింత జాగ్రత్తగా వ్యవహరించనుంది. జాతీయ జట్టులో పేరు ప్రకటించే ముందు ఆటగాడి ఫిట్‌నెస్‌పై 100 శాతం కాదు.. 200 శాతం నమ్మకం ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో పలువురు ఆటగాళ్లు జట్టులోకి ఎంపికైన తర్వాత ఫిట్‌నెస్ సమస్యలతో సిరీస్‌లకు దూరమయ్యారు. అలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా సెలెక్షన్ ప్రక్రియలోనే మరింత స్పష్టత తీసుకురావాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ గతంలోనే ఆటగాళ్ల ఫిట్‌నెస్, సెలెక్షన్ విషయంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశాడు. ఆటగాళ్లు ఇంకా జాతీయ సిరీస్‌లో పాల్గొనే స్థాయికి రాలేదన్న విషయాన్ని వారికి ముందుగానే తెలియజేస్తామని చెప్పాడు. అలాగే జట్టును ప్రకటించే సమయంలో ‘సబ్జెక్ట్ టు ఫిట్‌నెస్’ అనే షరతును స్పష్టంగా పేర్కొంటున్నామని లక్ష్మణ్ వివరించాడు. ఒకవేళ ఎంపికైన ఆటగాడు ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమైతే.. అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలో సెలెక్టర్లకు ముందుగానే అవగాహన ఉంటుందని తెలిపాడు.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా ఆటగాళ్ల పేర్లకు అస్టరిస్క్ ఎందుకు పెడుతున్నామో వివరించారు. అంతర్జాతీయ సిరీస్‌కు మూడు నుంచి నాలుగు వారాల ముందుగానే సాధారణంగా జట్టును ఎంపిక చేయాల్సి వస్తుందని.. ఆ సమయంలో ఆటగాడు పూర్తిగా ఫిట్‌గా లేకపోయినా, మ్యాచ్ సమయానికి కోలుకునే అవకాశం ఉండొచ్చని తెలిపారు. అందుకే ఆ సమయంలో ఆటగాడిని పూర్తిగా తిరస్కరించకుండా.. ఫిట్‌నెస్ షరతుతో జట్టులోకి ఎంపిక చేస్తున్నామని చెప్పారు. ఎంపిక జరిగిన 21 లేదా 28 రోజుల వ్యవధిలో ఆటగాడు పూర్తిగా కోలుకుంటే.. అతడిని సిరీస్‌కు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు.

అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20 సెప్టెంబర్ 13న ఢిల్లీలో జరగనుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్‌నెస్ విషయంలో మంచి పురోగతి సాధిస్తున్నట్లు తెలుస్తోంది. సిరీస్ తొలి మ్యాచ్‌కు వీరిద్దరూ పూర్తిగా సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యంగా గాయాల నుంచి తిరిగి వస్తున్న ఆటగాళ్లను తొందరపడి మైదానంలోకి దింపకూడదని సీఓఈ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నారని వైద్య బృందం నిర్ధారించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.