Site icon NTV Telugu

పాకిస్థాన్‌తో తొలి టెస్టు.. భారీ స్కోరుపై కన్నేసిన బంగ్లాదేశ్

సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ అంచనాలకు మించి రాణిస్తోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ బౌలర్లు దెబ్బతీశారు. ఓపెనర్లు ఇస్లాం (14), సైఫ్ హసన్ (14) పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. అనంతరం శాంతో (14), కెప్టెన్ మోనిముల్ హక్ (6) కూడా తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో 49 పరుగులకే బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Read Also: కాన్పూర్ టెస్టులో పుంజుకున్న న్యూజిలాండ్

అయితే ఆ తర్వాత వచ్చిన ముష్ఫీకర్ రహీమ్ (82), లిట్టన్ దాస్ (113) పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా వీళ్లిద్దరూ ఎడాపెడా బౌండరీలతో స్కోరును ముందుకు తీసుకువెళ్లారు. రహీమ్, దాస్ డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడంతో బంగ్లాదేశ్ కోలుకుంది. లిట్టన్ దాస్‌కు టెస్టుల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ, అష్రాఫ్, సాజిద్ ఖాన్‌కు తలో వికెట్ దక్కింది.

కాగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ తొలి టెస్టు ఆరంభానికి ముందు ఛటోగ్రామ్‌లో భూకంపం రావడంతో ఇరుజట్ల క్రికెటర్లు భయాందోళనలకు గురయ్యారు. దాంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనుమానం కలిగింది. అయితే భూకంప తీవ్రత మ్యాచ్‌ నిర్వహణపై ఎటువంటి ప్రభావం చూపలేదు. నిర్ణీత సమయానికే తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది.

Exit mobile version