Bangladesh: బంగ్లాదేశ్ క్రికెటర్, స్టార్ స్పిన్నర్ నయీమ్ హసన్‌పై పోలీసులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు చేయడం ఆ దేశంలో సంచలనంగా మారింది. చిట్టగాంగ్‌లోని పోలీస్ అధికారులు తనతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, లాఠీలు, ప్లాస్టిక్ పైపులతో కొట్టారని 25 ఏళ్ల నయీమ్ ఆరోపించారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీసీ), క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో ప్రైమ్ బ్యాంక్ క్రికెట్ క్లబ్ పాల్గొన్న ఒక కార్యక్రమం తర్వాత నయీమ్ హసన్ శుక్రవారం రాత్రి ఢాకా నుండి చిట్టగాంగ్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో దాడి జరిగింది. లాల్‌ఖాన్ బజార్ ప్రాంతం సమీపంలో అతను ప్రయాణిస్తున్న సీఎన్‌జీ ఆటో-రిక్షాను కొంతమంది పోలీసులు ఆపి, అతడి గొంతు పట్టుకుని ఆటోలో కూర్చోబెట్టి స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ప్రజలు అతను నేషనల్ టీమ్ క్రికెటర్ అని చెబుతున్నా వినకుండా తనతో దురుసుగా ప్రవర్తించారని నయీమ్ ఆరోపించారు.
‘‘నేను జాతీయ క్రికెటర్‌నని వారికి చెబుతూనే ఉన్నాను, కానీ వారు వినడానికి నిరాకరించారు. వారు నన్ను కర్రలతో, ప్లాస్టిక్ పైపులతో కొట్టారు. నేను పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, నా వివరాలు చెప్పినప్పుడు కూడా నన్ను గౌరవంగా చూడలేదు’’ అని నయీమ్ హసన్ వెల్లడించారు. తనను ప్రశ్నించాలంటే పోలీస్ జీపులో తీసుకెళ్లాలి కానీ, ఇలా ఆటోలో తీసుకెళ్లడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపి, దోషులపై శిక్ష పడేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ అమీరుల్ ఇస్లాం దర్యాప్తు ప్రారంభించారు. విధుల్లో ఉన్న అధికారులు నియమాలను పాటించలేదని తెలుస్తోదని ఆయన అంగీకరించారు. దోషిగా తేలిన అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై సీనియర్ క్రికెటర్ ముష్పీకర్ రహీమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ఈ ఘటనపై విమర్శలు చేస్తు్న్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

