Bangladesh vs Pakistan: సెమీస్ నుంచి సౌతాఫ్రికా నిష్క్రమించడంతో.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. ఈ రెండింటిలో ఏదైతే గెలుస్తుందో, ఆ జట్టు సెమీస్‌కి వెళ్తుంది. అందుకే.. ఈ రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని అంచనా వేశారు. ఇంతకుముందు కూడా ఈ తరహా కీలక మ్యాచ్‌ల సమయంలో.. ఈ ఇరుజట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి దృశ్యమే ఈసారి కూడా చూసేందుకు అవకాశం లభిస్తుందని ఆశించారు. చూస్తుంటే.. ఈ వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు.. ఏమంత ఆశాజనకమైన స్కోరు చేయలేకపోయింది. పాక్ బౌలర్ల ధాటికి అత్యల్ప స్కోరుతోనే చాపచుట్టేసింది. కేవలం 127 పరుగులు మాత్రమే చేసింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న బంగ్లాదేశ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడు లిటన్ దాస్ 10 పరుగులకే వెనుదిరగడంతో.. బంగ్లా స్కోర్ బోర్డు డీలా పడిపోయింది. ఓపెనర్ నజ్ముల్ హుసేన్ శాంతో (54) ఒక్కడే అర్థశతకంతో రాణించగా.. మిగతా బ్యాటర్లెవ్వరూ తన బ్యాట్‌కి పని చెప్పలేకపోయారు. సౌమ్య సర్కార్ (20), ఆఫిఫ్ హుసేన్ (24) కాస్త ఫర్వాలేదనిపించారు. ఇక ఇతరులంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. అయితే.. షకీబ్ అల్ హసన్ వికెట్ విషయంలో మాత్రం అంపైర్లు పెద్ద తప్పిదమే చేశారు. అల్ట్రా ఎడ్జ్‌లో బ్యాట్‌కి బంతి తగిలినట్లు క్లియర్‌గా కనిపిస్తున్నప్పటికీ.. థర్డ్ అంపైర్ దాన్ని ఔట్‌గా ఇచ్చాడు. ఈ నిర్ణయం పట్ల షకీబ్ సహా బంగ్లా ఆటగాళ్లందరూ అసహనం వ్యక్తం చేశారు. ఇటు.. సోషల్ మీడియాలోనూ ఇది సరైన నిర్ణయం కాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇక పాకిస్తాన్ బౌలర్ల విషయానికొస్తే.. షాహీన్ ఆఫ్రీది చెలరేగిపోయాడు. 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చిన అతను, నాలుగు వికెట్లు తీశాడు. షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. హారిస్ రౌఫ్, ఇఫ్తిఖర్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. ఎవ్వరూ భారీ పరుగులు సమర్పించుకోలేదు. ప్రతిఒక్కరూ పొదుపుగా బౌలింగ్ వేశారు. సెమీస్‌లో వెళ్లడానికి అరుదైన అవకాశం దక్కింది కాబట్టి.. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి, తమ సత్తా చాటారు. ఇప్పుడు బ్యాటర్లు ఎలా రాణిస్తారో చూడాలి.