పాకిస్థాన్ గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. లాహోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 115 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ కాగా బదులుగా పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 227/3 వద్ద డిక్లేర్ చేయగా పాకిస్థాన్ ముందు 351 పరుగుల టార్గెట్ నిలిచింది.
351 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను ఆస్ట్రేలియా 235 పరుగులకే ఆలౌట్ చేసింది. లయోన్ 5 వికెట్లతో చెలరేగాడు. ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు పడగొట్టగా స్టార్క్, గ్రీన్ చెరో వికెట్ తీశారు. ఇమామ్ ఉల్ హక్ (70), కెప్టెన్ బాబర్ ఆజమ్ (55) మాత్రమే హాఫ్ సెంచరీలతో రాణించారు. కాగా ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. మూడో టెస్టును ఆసీస్ కైవసం చేసుకోవడంతో 24 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్యాట్ కమిన్స్ (8 వికెట్లు), మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఉస్మాన్ ఖవాజా (496 పరుగులు) నిలిచారు.
