NTV Telugu Site icon

WTC Final: ఆస్ట్రేలియాకు ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు.. రెండో స్థానం ఎవరిది?

World Test Championship

World Test Championship

WTC Final: ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఒక బెర్తు ఖరారైంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టును ఆస్ట్రేలియా డ్రాగా ముగించడంతో ఆ జట్టుకు ఫైనల్ బెర్తు దక్కింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 75.56 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రెండో బెర్తు కోసం ఆసక్తికర పోటీ నెలకొంది. ప్రస్తుతానికి పాయింట్ల టేబుల్‌లో టీమిండియా రెండో స్థానంలో ఉంది. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ టీమిండియా అత్యంత కీలకమైనది. ఈ సిరీస్‌ను ఓడిపోకుండా 2-0 లేదా 3-0 తేడాతో టీమిండియా గెలిస్తే ఫైనల్ బెర్త్ ఖరారు అవుతుంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకోవడంతో టీమిండియా 58.93 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

Read Also: Health Tips: ప్రతిరోజూ నీటిలో నానబెట్టిన ఖర్జురాలను తింటే..?

ప్రస్తుతం పాయింట్ల టేబుల్‌లో శ్రీలంక 53.33 శాతంతో మూడో స్థానంలో, దక్షిణాఫ్రికా 48.72 శాతంతో నాలుగో స్థానంలో ఉన్నాయి. అయితే మార్చిలో శ్రీలంక జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆ జట్టు రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది. ఈ సిరీస్‌ను శ్రీలంక క్వీన్ స్వీప్ చేస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆ జట్టు రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది. అదే సమయంలో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఓడిపోయినా లేదా డ్రా చేసుకున్నా శ్రీలంకకు ఫైనల్ బెర్త్ ఖరారు కానుంది. ప్రస్తుతానికి డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి దక్షిణాఫ్రికా దాదాపు తప్పుకున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌ను ఆ జట్టు క్లీన్ స్వీప్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు.