ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా మూడో స్థానంతో తన ప్రస్థానం ముగించింది. జకార్తా వేదికగా జపాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో 1-0 తేడాతో విజయం సాధించి కాంస్య పతకం అందుకుంది. తొలి క్వార్టర్లోనే ఏడో నిమిషంలో రాజ్‌కుమార్ పాల్ ఏకైక గోల్ చేశాడు. ఆ తర్వాత రెండు జట్లు గోల్స్ కోసం చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.
ఈ టోర్నీలో టీమ్‌ఇండియా అనూహ్య ఓటములు చవిచూసింది. కానీ కీలకమైన మ్యాచుల్లో నెగ్గింది. సూపర్-4కు అర్హత సాధించేందుకు ఇండోనేషియా మ్యాచులో 16 గోల్స్ కొట్టింది. సూపర్-4లో ఆఖరి రౌండ్ రాబిన్ మ్యాచులో దక్షిణ కొరియాతో తలపడింది. ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచును టీమ్‌ఇండియా 4-4తో డ్రా చేసింది. మెరుగైన గోల్ స్కోర్ వల్ల కొరియా ఫైనల్‌కు వెళ్లింది. ఫలితంగా జపాన్‌తో భారత్ మూడో స్థానం కోసం పోటీ పడింది.
అంతకు ముందు సూపర్-4 టీమ్‌ఇండియా విచిత్రంగా క్వాలిఫై అయింది. ఇండోనేషియాతో మ్యాచులో ఏకంగా 16 గోల్స్ కొట్టింది. దీంతో పాకిస్తాన్ ఇంటి బాట పట్టింది. ఈ మ్యాచ్ చివరి క్వార్టర్‌లో ఏకంగా ఏడు గోల్స్‌ను భారత్ సాధించడం విశేషం.భారత్ మొదటి క్వార్టర్ ముగిసేసరికి 3-0, రెండో క్వార్టర్ ముగిసేసరికి 6-0, మూడో క్వార్టర్ ముగిసేసరికి 10-0 ఆధిక్యంతో నిలిచింది. చివరి క్వార్టర్‌లో ఏకంగా ఆరు గోల్స్ సాధించి మ్యాచ్‌ను గెలుచుకోవడంతో పాటు సూపర్-4లోకి కూడా అడుగుపెట్టింది. ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో భారత్ 1-1తో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఆ తర్వాత జపాన్ చేతితో 2-5తో ఓడింది. ఇక ఇండోనేషియాను 16-0తో ఓడించి సూపర్-4లోకి అడుగుపెట్టింది.