Who Is Ananya Birla: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రాంచైజీ చేతులు మారిన విషయం తెలిసిందే. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్‌ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్ సంస్థలు కలిసి ఆర్‌సీబీని రూ.16,706 కోట్ల ధరకు దక్కించుకున్నాయి. ఆర్‌సీబీ యాజమాన్యంలో జరిగిన మార్పుతో బిర్లా కుటుంబం మళ్లీ వార్తల్లోకి నిలిచింది. ముఖ్యంగా ఆర్యమన్ విక్రమ్ బిర్లా ఆర్‌సీబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో.. ఆయన సోదరి అనన్య బిర్లా పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అనన్యకు నేరుగా ఆర్‌సీబీ యాజమాన్యం లేదా నిర్వహణలో భాగస్వామ్యం లేకపోయినా.. కుటుంబ అనుబంధం కారణంగా ఆమెపై పేరు నెట్టింట వైరల్ అవుతోంది.
అనన్య బిర్లా ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగలం బిర్లా కుమార్తె. 1994లో ముంబైలో జన్మించిన ఆమె అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో చదివారు. ఆ తరువాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. శక్తివంతమైన వ్యాపార కుటుంబానికి చెందినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో ఆమె సక్సెస్ అయ్యారు. కేవలం 17 ఏళ్ల వయసులోనే అనన్య ‘స్వతంత్ర మైక్రోఫిన్’ అనే సంస్థను స్థాపించి తన ఎంటర్‌ప్రెన్యూర్ ప్రయాణాన్ని ప్రారంభించారు. గ్రామీణ మహిళలకు చిన్న మొత్తాల్లో రుణాలు అందిస్తూ ఆర్థిక స్వావలంబనకు దోహదపడే ఈ సంస్థ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అనంతరం డిజిటల్, కన్స్యూమర్ రంగాల్లో ‘ఇకై అసాయి’ బ్రాండ్‌ను ప్రారంభించారు.
Also Read: Lavanya Drunk Driving Case: మద్యం మత్తులో రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య హల్‌చల్.. కేసు నమోదు!
కుటుంబ వ్యాపారంలోనూ అనన్య బిర్లా కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ వంటి కంపెనీల బోర్డుల్లో సభ్యురాలిగా కొనసాగుతూ.. డిజిటల్ విస్తరణకు తన వంతు సహకారం అందిస్తున్నారు. వ్యాపార రంగంతో పాటు సంగీతంలో కూడా ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాప్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుని.. మిలియన్ల వ్యూస్ సాధించారు. మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ‘ఎంపవర్’ వంటి కార్యక్రమాల ద్వారా ఆమె చురుకుగా పనిచేస్తున్నారు. యువతలో మెంటల్ హెల్త్‌పై అవగాహనను ముందుకు తీసుకెళ్లడంలో అనన్య కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రస్తుతం అనన్య బిర్లా ట్రెండ్ అవ్వడానికి మరో కారణం కూడా ఉంది. ఐపీఎల్ 2026 ప్రమోషనల్ ఈవెంట్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో జరిగిన ఓ సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. గిల్ తాను సైన్ చేసిన జెర్సీని అనన్యకు అందించాడు. ఆ చిన్న సంఘటననే నెటిజన్లు మీమ్స్, ఫన్నీ పోస్టులతో ట్రెండ్ చేశారు. ఆర్‌సీబీ యాజమాన్యంలో నేరుగా భాగస్వామ్యం లేకపోయినా.. బిర్లా కుటుంబ అనుబంధం, వ్యాపార విజయాలు, గ్లోబల్ ఇమేజ్ కారణంగా అనన్య ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. రానున్న రోజుల్లో ఐపీఎల్, బిజినెస్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో ఆమె పేరు మరింతగా వినిపించే అవకాశం ఉంది.
