Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్‌షిప్‌.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!

Amaravati Championship 2026

Amaravati Championship 2026

Amaravati Championship 2026 Starts From Today: తిరుపతిలో నేటి నుంచి అమరావతి ఛాంపియన్‌షిప్‌ 2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఎస్వీ యూనివర్సిటీ తారకరామా గ్రౌండ్స్‌లో ఉదయం పోటీల ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడల మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరుకానున్నారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు క్రీడాకారులతో కలిసి కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో వంటి క్రీడల్లో పాల్గొననున్నట్లు సమాచారం. రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు తరలిరానున్నారు.

అమరావతి ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 వేల మంది క్రీడాకారులు, కోచ్‌లు, సిబ్బంది పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. పోటీలకు వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుపతి జిల్లా యంత్రాంగం, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. క్రీడాకారులు, కోచ్‌లు, సిబ్బందికి వసతి, భోజనం, రవాణా, వైద్య సదుపాయాలు, భద్రత వంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోటీలు సజావుగా జరిగేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయనున్నాయి.

మరోవైపు ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అమరావతి ఛాంపియన్‌షిప్‌లో విజేతలకు భారీగా నగదు బహుమతులు అందించనున్నట్లు శాప్‌ చైర్మన్‌ ప్రకటించారు. మొత్తం రూ.91.90 లక్షలు నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. విజేతలకు నగదు బహుమతులను మంత్రి నారా లోకేష్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులకు మంచి వేదిక కల్పించడంతో పాటు.. వారిలో పోటీతత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుపతిలో నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ ఛాంపియన్‌షిప్‌ తో నగరంలో క్రీడా సందడి నెలకొననుంది. వేలాది మంది క్రీడాకారులు పాల్గొంటున్న నేపథ్యంలో పోటీల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.