Site icon NTV Telugu

Ajit Agarkar: నా పదవీకాలం పొడిగించండి.. బీసీసీఐని కోరిన అజిత్‌ అగార్కర్‌!

Ajit Agarkar

Ajit Agarkar

టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన పదవీకాలాన్ని పొడిగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ను కోరినట్లు సమాచారం. పదవీకాలాన్ని 2027 వన్డే వరల్డ్ కప్ వరకు పొడిగించాలని కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్‌ కప్‌ 2026ను భారత్ గెలిచిన వెంటనే అగార్కర్‌ ఈ మేరకు బీసీసీఐని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బీసీసీఐలో చర్చలు జరుగుతున్నాయట. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై బీసీసీఐ, అగార్కర్‌ కానీ అధికారికంగా ధ్రువీకరించలేదు.

ఇప్పటికే ఐపీఎల్ 2025కు ముందు అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్‌ను మరో ఏడాది పాటు బీసీసీఐ పొడిగించింది. భారత్ 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో అతని పాత్రను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2026 విజయం అనంతరం అగార్కర్‌ తన అభ్యర్థనను బీసీసీఐ ముందుంచాడట. 2020-21లో చీఫ్ సెలెక్టర్ పదవి ఖాళీ అయినప్పుడు అగార్కర్ కూడా దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఆ అవకాశం చెతన్ శర్మకు దక్కింది. 2023 మధ్యలో అగార్కర్‌ బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి సెలెక్షన్ ప్రక్రియ ఆయనకు పెద్ద సవాల్‌గా మారింది.

అజిత్ అగార్కర్ పదవీకాలంలో భారత జట్టు నాలుగు ఐసీసీ ఫైనల్స్ ఆడింది. 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్ ఆడింది. వీటిలో మూడు టైటిళ్లు గెలుచుకోవడం విశేషం. అగార్కర్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్‌గా మద్దతు ఇవ్వడం, అలాగే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం వంటి నిర్ణయాలు ధైర్యసాహసాలతో కూడినవిగా చెప్పాలి. ఈ నిర్ణయాలపై విమర్శలు వచ్చినప్పటికీ.. అగార్కర్ వాటిని సమర్థంగా ఎదుర్కొన్నారు.

జట్టు ఎంపిక అనేది కేవలం గణాంకాలపై ఆధారపడే ప్రక్రియ కాదు. ఆటగాళ్ల సామర్థ్యం, జట్టులో వారి పాత్ర, వ్యూహాత్మక ఆలోచనలన్నీ కలిసి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఈ విషయంలో అగార్కర్, అతని సెలెక్షన్ కమిటీ సక్సెస్ అయినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే.. అగార్కర్ నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు వైట్ బాల్ ఫార్మాట్‌లో మంచి ఫలితాలు సాధించింది. ఈ నేపథ్యంలో ఆయన పదవీకాలాన్ని 2027 వరల్డ్ కప్ వరకు పొడిగిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Exit mobile version