Site icon NTV Telugu

Ajay Jadeja: ఆ విషయంలో రోహిత్ ఫెయిల్.. జడేజా సంచలన వ్యాఖ్యలు

Jadeja On Rohit

Jadeja On Rohit

Ajay Jadeja Shocking Comments On Rohit Sharma: రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ దిగ్విజయంగా దూసుకుపోతోంది. రికార్డ్ స్థాయిలో విజయాలు నమోదు చేసింది. కానీ.. ఫీల్డింగ్ విషయంలోనే విమర్శల్ని మూటగట్టుకుంటోంది. పేలవమైన ఫీల్డింగ్ కారణంగా.. కొన్ని మ్యాచెస్‌ని చేజేతులా పోగొట్టుకుంది. అంతెందుకు.. రీసెంట్‌గా టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా సౌతాఫ్రికా చేతిలో ఓడిపోవడానికి కారణం కూడా మిస్ ఫీల్డింగేనని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే భారత్ ఫీల్డింగ్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ పగ్గాలు విడిచిపెట్టినప్పటి నుంచి.. ఫీల్డింగ్‌ పరంగా భారత జట్టు వెనకపడిందని అన్నాడు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో బ్యాటింగ్‌, బౌలింగ్‌కు మెరుగులు దిద్దేందుకు జట్టు పరిమితమైందన్నారు.

‘‘ఆసియా జట్లు.. మరీ ముఖ్యంగా భారత జట్టు ఫీల్డింగ్‌ పరంగా ఏమాత్రం దృష్టి సారించడం లేదని అనిపిస్తోంది. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు.. ఫీల్డింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనే మాట చివరిసారిగా విన్నా. అతడు ఫీల్డింగ్‌ బాగా చేయగలిగిన వారినే ఎంపిక చేసేవాడు. అయితే.. విరాట్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు కోచ్ కూడా మారిపోవడంతో.. ఫీల్డింగ్ విషయంలో భారత్ చతికిలపడింది. ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్ శర్మకు ఫీల్డింగ్ అంశంలో అంతగా పట్టింపు లేనట్టు కనిపిస్తోంది. అతడి దృష్టి కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మీదే ఉంది. టీమ్‌ఇండియా ఆటగాళ్లలో అథ్లెట్లకు ఉండాల్సిన లక్షణాలు కొరవడినట్టు అర్థమవుతోంది’’ అంటూ జడేజా కుండబద్దలు కొట్టాడు. జట్టును ఎంపిక చేసే ముందు.. ఆటగాళ్ల నుంచి ఏం రాబట్టాలో కచ్ఛితంగా తెలుసుకోవడంలో, భారత జట్టు విఫలమైందని విమర్శించాడు.

కాగా.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చేతికి అందిన క్యాచ్‌ని వదిలేసిన సంగతి తెలిసిందే! కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఈజీ రనౌట్‌ని మిస్ చేశాడు. వీటితో పాటు మరికొన్ని మిస్ ఫీల్డ్స్ కూడా అయ్యాయి. ఈ తప్పిదాలు జరగడం వల్లే.. గెలవాల్సిన మ్యాచ్‌ని చేజేతులా వదులుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ఆ తప్పిదాలు జరగకుండా ఉంటే, భారత్ కచ్ఛితంగా ఆ మ్యాచ్ గెలిచి ఉండేది. తద్వారా.. సెమీస్‌లో బెర్తు దాదాపు ఖరారు చేసుకునేది.

Exit mobile version