క్రికెట్‌లో టీ20 ఫార్మాట్ వచ్చాక భారత జట్టుకు దూకుడు మరింత అలవాటైంది. ముఖ్యంగా బ్యాటర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. అతి తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీలు, సెంచరీలు చేస్తున్నారు. తక్కువ బంతుల్లోనే ఫిఫ్టీ చేయడం చాలామంది బయటర్లకు అలవాటైపోయింది. ఈ క్రమంలో పలువురు భారత ఆటగాళ్లు అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు సాధించి రికార్డులు నెలకొల్పారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై కేవలం 12 బంతుల్లోనే 50 పరుగులు చేసి క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆ ఇన్నింగ్స్ ఇప్పటికీ భారత టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా కొనసాగుతోంది.
Also Read: Tilak Varma Fitness: టీమిండియాకు గుడ్ న్యూస్.. తిలక్ వర్మ వచ్చేస్తున్నాడు!
రెండో స్థానంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఉన్నాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లాండ్‌పై 17 బంతుల్లో 50 రన్స్ చేసి ఈ జాబితాలో మరోసారి చోటు దక్కించుకోవడం విశేషం. ఈ లిస్ట్‌లో హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 15 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. ఇంగ్లాండ్‌పై 18 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ కూడా ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. ప్రస్తుతం అభిషేక్ ఫామ్, ఆత్మవిశ్వాసం చూస్తే రాబోయే సంవత్సరాల్లో 10 బంతుల్లోనే 50 పరుగులు సాధించే సత్తా అతడికి ఉందనే అభిప్రాయం క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. యువరాజ్ సింగ్ రికార్డును సైతం ఛేదించే రోజు ఎంతో దూరంలో లేదని ఫాన్స్ అంటున్నారు.
