భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకున్న నాటి నుంచి టీమిండియాకు ఇప్పటివరకు ఒకే ఏడాదిలో ఏడుగురు కెప్టెన్‌లుగా వ్యవహరించారు. ఏడాది నుంచి చూస్తే టీమిండియాకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, ఆజింక్యా రహానె, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా కెప్టెన్‌లుగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకే సమయంలో రెండు పర్యటనలకు వెళ్లడం, సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం, పలువురు గాయపడటం వంటి పరిస్థితుల కారణంగా ఏడుగురు కెప్టెన్‌లు పనిచేయాల్సి వచ్చింది.
గత ఏడాది జూన్‌లో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్ టూర్‌కు వెళితే.. శ్రీలంకలో శిఖర్ ధావన్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టు పర్యటించింది. శ్రీలంక పర్యటనలో కెప్టెన్‌గా వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో అందించిన శిఖర్ ధావన్.. కరోనా దెబ్బతీయడంతో టీ20 సిరీస్‌ను మాత్రం 1-2తో ప్రత్యర్థికి అప్పగించాడు.
అటు దక్షిణాఫ్రికా పర్యటనలో రెండో టెస్ట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ అనంతరం వన్డే సిరీస్‌కు కూడా సారథిగా వ్యవహరించాడు. ఈ పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోగా… రాహుల్ కెప్టెన్సీలో వన్డే సిరీస్‌లో వైట్ వాష్ అయ్యింది. సౌతాఫ్రికా టూర్ నుంచి వచ్చిన తర్వాత స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంక జట్లతో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లు ఆడగా రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ రెండు జట్లను క్లీన్ స్వీప్ చేసి వరుసగా 15 మ్యాచుల్లో రోహిత్ విజయాలు అందుకున్నాడు. తాజాగా ఐపీఎల్ ముగిసిన తర్వాత తాత్కాలిక కెప్టెన్‌గా ఎంపికైన కేఎల్ రాహుల్ గాయపడటంతో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌కు రిషబ్ పంత్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. త్వరలో ఐర్లాండ్‌లో పర్యటించనున్న భారత జట్టుకు హార్డిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దీంతో ఆటగాళ్లు గందరగోళానికి గురయ్యే పరిస్థితులు జట్టులో నెలకొన్నాయి.