అండర్-19 వరల్డ్‌కప్ 2026 ఫైనల్‌లో భారత యువ జట్టు బ్యాటింగ్‌లో సత్తా చాటింది. ఇంగ్లాండ్‌తో హరారేలో జరుగుతున్న టైటిల్ పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. 80 బంతుల్లో 15 సిక్సులు, 15 ఫోర్లతో 175 రన్స్ బాదాడు. వరుస బౌండరీలు, సిక్సులతో ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. 218.75 స్ట్రైక్‌రేట్‌తో అతను ఆడిన దూకుడైన ఇన్నింగ్స్ ఫైనల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లతో వీరవిహారం చేశాడు. ఈ క్రమంలోనే 55 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ బాదాడు. సెంచరీ అనంతరం వైభవ్ మరింత చెలరేగాడు. కేవలం 25 బంతుల్లోనే 75 రన్స్ చేశాడు. వైభవ్ ఊపు చూస్తే సునాయాసంగా డబుల్ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో మానీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో వైభవ్ సుడిగాలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇంగ్లాండ్‌బౌలర్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Euphoria Movie Review: ‘యుఫోరియా’ రివ్యూ.. గుణశేఖర్ సక్సెస్ అందుకున్నారా?
కెప్టెన్ ఆయుష్ మహాత్రే 53 పరుగులు చేసి మంచి సహకారం అందించగా.. వేదాంత్ త్రివేది (32), విహాన్ మల్హోత్రా (30), అభిగ్యాన్ కుందు (40) కీలక పరుగులు చేశారు. చివర్లో కనిష్క్ చౌహాన్ 20 బంతుల్లో 37 పరుగులతో వేగంగా ఆడడంతో భారత్ స్కోర్ 400 దాటింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ మింటో 3 వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గన్, అలెక్స్ గ్రీన్ చెరో రెండు వికెట్లు తీశారు. వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ ఫైనల్‌లో 411 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది. ఈ భారీ స్కోర్‌ను చేధించడం ఇంగ్లాండ్ జట్టుకు పెను సవాలులే అని చెప్పాలి.
