NTV Telugu Site icon

T20 World Cup: పాకిస్థాన్ పిలుస్తోంది.. 1992 సెంటిమెంటా? 2007 సెంటిమెంటా?

India Vs Pakistan

India Vs Pakistan

T20 World Cup: టీ20 ప్రపంచకప్ 1992 వన్డే ప్రపంచకప్ జరిగినట్లే జరుగుతోంది. అప్పుడు, ఇప్పుడు మెగా టోర్నీకి వేదిక ఆస్ట్రేలియానే కావడం గమనించాల్సిన విషయం. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా దయతో సెమీస్ బెర్త్ కొట్టేసిన పాకిస్థాన్ ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు రెండో సెమీస్ నుంచి ఫైనల్‌కు ఎవరు వస్తారు అన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ క్రికెట్ అభిమానులు దాయాదుల పోరును చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. పాకిస్థాన్ కూడా ఫైనల్‌కు భారత్ రావాలని కోరుకుంటోంది. అయితే కొందరు పాకిస్థాన్ అభిమానులు మాత్రం 1992 సెంటిమెంట్ రిపీట్ అవ్వాలంటే టీమిండియా కాకుండా ఇంగ్లండ్ ఫైనల్‌కు రావాలని ఆరాటపడుతున్నారు. ఎందుకంటే 1992 వన్డే ప్రపంచకప్‌లోనూ తొలి సెమీస్ న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరగ్గా పాకిస్థాన్ విజయం సాధించింది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌పై పాకిస్తాన్ గెలిచి విశ్వవిజేతగా అవతరించింది.

Read Also: T20 World Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్థాన్.. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ చిత్తు

అటు టీమిండియా అభిమానులు కూడా 2007 ప్రపంచకప్ సెంటిమెంట్ రిపీట్ కావాలని కోరుకుంటున్నారు. గురువారం నాడు రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌పై గెలిస్తే టీమిండియా కూడా ఫైనల్ చేరుతుంది. 2007లో గ్రూప్ స్టేజీలో భారత్ నంబర్‌వన్‌గా నిలవగా.. ఇప్పుడు కూడా గ్రూప్ స్టేజీలో టీమిండియా నంబర్‌వన్‌గా నిలిచిందని పలువురు గుర్తుచేస్తున్నారు. అప్పుడు గ్రూప్ స్టేజీలో పాకిస్థాన్‌పై భారత్ గెలవగా.. ఇప్పుడు కూడా పాకిస్థాన్‌పై రోహిత్ సేన విజయం సాధించింది. తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ గెలిచింది. ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ తలపడగా టీమిండియా విజేతగా అవతరించింది. ఇప్పుడు కూడా ఇదే రిపీట్ అవుతుందని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు. మరి గురువారం రెండో సెమీస్ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో అన్న విషయంపై ఈ టోర్నీ ఫలితం ఆధారపడి ఉంది.