NTV Telugu Site icon

The Indian Box Office Report-September 2022: మన సినిమా.. రిపోర్ట్‌ మామా..

Indian Box Office Report

Indian Box Office Report

The Indian Box Office Report-September 2022: మన దేశంలో టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌.. ఇలా పలు ఫిల్మ్‌ ఇండస్ట్రీలు ఉన్నాయి. వాటి నుంచి ప్రతి వారం, ప్రతి నెలా ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో కొన్ని మూవీలు అలా వచ్చి ఇలా పోతున్నాయి. చాలా కొద్ది పిక్చర్లు మాత్రమే హిట్‌ అవుతున్నా భారీగా కలెక్షన్లు కురిపిస్తున్నాయి. అందుకే.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ రిపోర్టుకు బిజినెస్‌పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నేపథ్యంలో ఆర్మాక్స్‌ మీడియా అనే సంస్థ ప్రతి నెలా మూడో వారంలో ఈ నివేదికను విడుదల చేస్తోంది. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పొందుపరుస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ మంత్ రిపోర్ట్‌ వచ్చేసింది. అందులోని ముఖ్యాంశాలను చూద్దాం..

ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ మొత్తమ్మీద ఈ ఏడాది ఇప్పటివరకు వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్ల మార్క్‌ దాటిన 3వ నెలగా సెప్టెంబర్‌ నిలిచింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కూడా వెయ్యి కోట్ల రూపాయల చొప్పున కలెక్షన్లు వచ్చాయి. కేజీఎఫ్‌-2 మరియు ‘ట్రిపుల్‌ ఆర్‌’ సినిమాల వల్ల మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఈ రేంజ్‌లో కాసులు కురిశాయి. పొన్నియిన్ సెల్వన్, బ్రహ్మాస్త్ర మరియు కాంతార మూవీల కలెక్షన్లతో సెప్టెంబర్‌లో కూడా ఇండియన్‌ బాక్సాఫీస్‌ కళకళలాడింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు.. అంటే.. మొత్తం 9 నెలల్లో అన్ని భాషల సినిమాలు కలిపి 8 వేల 205 కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి.

read more: Bill Gates Financial Support to Africa: కావాలి ఇంకా.. అంటున్న ఆఫ్రికా..

ఈ రిపోర్టును సెప్టెంబర్‌ వరకు అందుబాటులో ఉన్న సమాచారంతో రూపొందించినందున దాని ప్రకారం ఈ ఏడాదిలో ఇంకా మూడు నెలలు ఉన్నాయి. ఈ మూడు నెలల్లో మరో 2 వేల 743 కోట్ల రూపాయలు వసూలైతే.. 10 వేల కోట్ల రూపాయలతో అత్యంత భారీ కలెక్షన్లు నమోదు చేసిన ఇండియన్‌ బాక్సీఫీస్‌ బిగ్గెస్ట్‌ అండ్‌ బెస్ట్‌ ఇయర్‌గా 2022 అవతరిస్తుంది. ఇప్పటివరకు ఈ రికార్డు 2019వ సంవత్సరం పేరిట ఉండిపోయింది. ఆ ఏడాది మొత్తం 10 వేల 948 కోట్ల రూపాయల కలెక్షన్లు రావటం విశేషం.

ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో రిలీజైన సినిమాల మొత్తం వసూళ్లు 11 వందల 2 కోట్ల రూపాయలు. పొన్నియిన్‌ సెల్వన్‌ మరియు కాంతార మూవీలు ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతుండటంతో మరిన్ని వసూళ్లను రాబట్టనున్నాయి. కాంతార సినిమా.. మొదట.. కన్నడ భాషలో విడుదలైంది. ఆ తర్వాత.. అక్టోబర్‌లో.. హిందీ, తెలుగు భాషల్లో రిలీజైంది. సెప్టెంబర్‌ 3వ వారం నాటికి పొన్నియిన్‌ సెల్వన్‌ మూవీ 337 కోట్ల రూపాయల వసూళ్లతో టాప్‌లో నిలిచింది. బ్రహ్మాస్త్ర 308 కోట్లతో సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. 104 కోట్లతో కాంతార 3వ స్థానానికి చేరుకుంది.

విక్రమ్‌ వేధ 92 కోట్లు, వెందు తనిన్‌ధతు కాదు 55 కోట్లు, నానె వరువెన్‌ 35 కోట్లు, చుప్‌ 14 కోట్లు, పంతోపథమ్‌ నూత్తందు 13 కోట్లు, ఒకే ఒక జీవితం 11 కోట్లు, కృష్ణ వ్రింద విహారి 9 కోట్లతో కాంతార సినిమాకి దిగువన ఉన్నాయి. సెప్టెంబర్‌లో రిలీజైన టాప్‌-10 సినిమాల్లో పొన్నియిన్‌ సెల్వన్‌.. బ్రహ్మాస్త్ర.. ఈ రెండే ఏకంగా 59 శాతం షేర్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు విడుదలైన అన్ని భాషల సినిమాల్లోకెల్లా ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ టు’ 970 కోట్ల రూపాయలతో హయ్యస్ట్ వసూళ్లు చేసిన పిక్చర్‌గా నిలిచింది. ఆ తర్వాత 869 కోట్లతో ‘ట్రిపుల్‌ ఆర్‌’ సెకండ్ ప్లేస్‌ను ఆక్రమించింది.

పొన్నియిన్‌ సెల్వన్‌ 337 కోట్లు, బ్రహ్మాస్త్ర 308 కోట్లు, ది కాశ్మీర్‌ ఫైల్స్‌ 292 కోట్లు, విక్రమ్‌ 284 కోట్లు, భూల్‌ భులయ్యా-టు 219 కోట్లు, బీస్ట్‌ 165 కోట్లు, డాక్టర్‌ స్ట్రేంజ్‌ ఇన్‌ ది మల్టీవర్స్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌ 163 కోట్లు, గంగూబాయి కతియావాడి 153 కోట్లు సాధించి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భాషలవారీగా రిలీజైన సినిమాల గ్రాస్‌ డొమెస్టిక్‌ బాక్సాఫీస్‌ షేర్‌ను పరిశీలిస్తే.. జనవరి, సెప్టెంబర్‌ మధ్య కాలంలో అత్యధిక వాటా హిందీ సినిమాలదే. ఈ భాషా చిత్రాల ద్వారా వచ్చిన వసూళ్ల శాతం 33. ఆ తర్వాత.. 22 శాతం షేరు తెలుగు సినిమాలది కావటం గమనించాల్సిన విషయం.

ఈ ఏడాది ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీస్‌లో తమిళ సినిమాలు 19 శాతం, కన్నడ చిత్రాలు 8 శాతం, హాలీవుడ్‌ మూవీస్‌ 7 శాతం, మలయాళం సినిమాలు 6 శాతం, ఇతర భాషల చిత్రాలు 5 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. తమిళి సినిమాల వాటా జనవరి, ఆగస్టు మధ్య కాలంలో 16 శాతం మాత్రమే కాగా పొన్నియన్‌ సెల్వన్‌ ఔట్‌ స్టాండింగ్‌ పెర్ఫార్మెన్స్‌తో ఈ షేరు జనవరి, సెప్టెంబర్‌ మధ్య కాలానికి 3 శాతం పెరిగి 19కి చేరుకుంది. దీంతో తెలుగు, తమిళి సినిమాల మధ్య తేడా తగ్గింది. ఇదిలాఉండగా ఈ ఏడాది 9 నెలల్లో తమిళ, తెలుగు, కన్నడ సినిమాల గ్రాస్‌ బాక్సాఫీస్‌ కలెక్షన్లు 2019 నాటి వసూళ్లను దాటిపోవటం కొసమెరుపు.