(మే 31న హీరో కృష్ణ పుట్టినరోజు)
తెలుగు చిత్రసీమలో ఎందరో నటశేఖరులు. వారిలో కృష్ణ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. కృష్ణ నటశేఖరునిగా వెలిగిన తీరు సైతం ఆసక్తి కలిగిస్తుంది. ‘తేనేమనసులు’ (1965)కు ముందు కొన్ని చిత్రాలలో బిట్ రోల్స్ లో కనిపించిన కృష్ణ, తరువాత ‘గూఢచారి 116’గా అలరించారు. ఆ సినిమా సక్సెస్ తో మాస్ హీరోగా స్థిరపడ్డారే కానీ, ఆయన కోరుకున్న స్టార్ డమ్ దరి చేరలేదు. పలు ప్రయత్నాలు సాగించారు. హీరోగా మాత్రమే నటిస్తానని భీష్మించుకోకుండా తన వద్దకు చేరిన ప్రతీపాత్రను అంగీకరిస్తూ ముందుకు సాగారు కృష్ణ. నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్ స్థాయి విజయాలను చవిచూడాలని కృష్ణ భావించారు. వారి స్థాయిలో ఖర్చు పెట్టి తనతో చిత్రాలు తీసే నిర్మాతల కోసం ప్రయత్నించలేదు.
తన సోదరులు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు నిర్మాతలుగా ‘పద్మాలయా’ సంస్థను ఏర్పాటు చేశారు. ఆరంభంలోనే ‘అగ్నిపరీక’ తీసి చేతులు కాల్చుకున్న అన్నదమ్ములు తరువాత రంగుల్లో సినిమా నిర్మించాలని తపించారు. తెలుగులో తొలి కౌబోయ్ మూవీగా ‘మోసగాళ్ళకు మోసగాడు’ నిర్మించారు కృష్ణ సోదరులు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తరువాత ప్రభాకర్ రెడ్డి అందించిన కథతో ‘జయప్రద పిక్చర్స్’ పతాకంపై ‘పండంటి కాపురం’ నిర్మించారు. ఈ సినిమా అనూహ్య విజయం సాధించి, 1972 సంవత్సరం బ్లాక్ బస్టర్ గా నిలచింది. తాము కోరుకున్న విజయం దరి చేరగానే కృష్ణ, ఆయన సోదరులు సంతోషించారు. ఆ ఉత్సాహంతోనే తమ అభిమాన నటుడు యన్టీఆర్ హీరోగా ‘దేవుడు చేసిన మనుషులు’ తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. 1973 బ్లాక్ బస్టర్ గా ఆ సినిమా నిలచింది. సోదరుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. దాంతో మరో అడుగు ముందుకేసి తెలుగులో తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమా స్కోప్ చిత్రంగా ‘అల్లూరి సీతారామరాజు’ నిర్మించారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు కథతో తెరకెక్కిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. 1974 సంవత్పరపు సూపర్ హిట్ గా ‘అల్లూరి సీతారామరాజు’ నిలచింది. అంతకు ముందు కృష్ణ నిర్మించి, ఘనవిజయాలు చూసిన రెండు చిత్రాలలోనూ యన్టీఆర్, ఎస్వీఆర్ వంటి మహానటులు ఉన్నారు. అందువల్ల ఆ విజయాలను జనం కృష్ణకు ఆపదించలేదు. ‘అల్లూరి సీతారామరాజు’ విజయం మాత్రం కృష్ణ ఒక్కడికే సొంతమయింది. పైగా అది ఆయన నటించిన 100వ చిత్రం కావడం విశేషం. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం చూసిన విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి, “ఈ ఇమేజ్ నీకు తరువాత డ్యామేజ్ గా మారుతుందయ్యా. ఎందుకంటే, ఇంత పవర్ ఫుల్ పాత్రలో నిన్ను చూసిన జనం, మరో పాత్రలో నిన్ను చూడటానికి సమయం తీసుకుంటారు” అని చెప్పారట. చక్రపాణి జోస్యం నిజమయింది. ‘అల్లూరి సీతారామరాజు’ తరువాత దాదాపు 12 చిత్రాలు కృస్ణకు పరాజయం చవిచూపించాయి. ఆ తరువాత కృష్ణ సొంత చిత్రం ‘పాడిపంటలు’ (1976)తో మళ్ళీ ఆయన సక్సెస్ ట్రాక్ ఎక్కారు.
ఇప్పటి స్టార్ హీరోస్ లో చాలామంది ఇతరులు నిర్మించే చిత్రాలు మానేసి, తాము నటించే ప్రతీ చిత్రంలో భాగస్వాములవుతున్నారు. లేదా సొంత చిత్రాలపైనే మోజు చూపిస్తున్నారు. యన్టీఆర్, ఏయన్నార్ తమ అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించడానికి సొంత నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణ సైతం అదే తీరున తనతో ఇతర నిర్మాతలు బడ్జెట్ మూవీస్ తీసినా, తన సొంత చిత్రాలతో భారీ బడ్జెట్ నిర్మించి అభిమానులను ఆనందింప చేయవచ్చునని భావించారు. అదే తీరున కృష్ణ నటప్రయాణం సాగింది. ‘పద్మాలయా’ బ్యానర్ నుండి ఓ కృష్ణ సినిమా వస్తోందంటే, అందులో భారీతనం భలేగా ఉంటుందని సినీజనం భావించేలా ఆయన, సోదరులు చిత్రనిర్మాణం సాగించారు. తెలుగు తెరకు ఈ సోదరులు తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమా స్కోప్ చిత్రాన్ని అందించినట్టుగానే, మొట్టమొదటి 70 ఎమ్.ఎమ్. చిత్రాన్ని కూడా పద్మాలయా సంస్థనే నిర్మించడం విశేషం. కృష్ణ తాను తొలిసారి దర్శకత్వం వహిస్తూ ‘సింహాసనం’ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో నిర్మించారు. హిందీలో జితేంద్ర హీరో కాగా, తెలుగులో కృష్ణనే కథానాయకుడు. తొలిసారి దర్శకత్వం వహించిన జానపదంలోనే ద్విపాత్రాభినయం చేయడం, అందునా ఆ చిత్రాన్ని తొలి తెలుగు 70 ఎమ్.ఎమ్.గా నిర్మించడం కృష్ణ అభిమానులకు ఎంతో ఆనందం కలిగించింది. ఇక కృష్ణ 200వ చిత్రం ‘ఈనాడు’, 300వ సినిమా ‘తెలుగువీర లేవరా’ చిత్రాలు కూడా పద్మాలయా బ్యానర్ లోనే తెరకెక్కి అభిమానులకు ఆనందం పంచాయి.
కృష్ణ సోదరులు తమ ‘పద్మాలయా’ పతాకంపై తెలుగులో అనేక మరపురాని చిత్రాలను రూపొందించారు. తమిళ, హిందీ భాషల్లోనూ ‘పద్మాలయా’ సంస్థ నిర్మించిన చిత్రాలు జయకేతనం ఎగురవేశాయి. తెలుగులో కృస్ణ హీరోగా రూపొందిన ‘ఊరికి మొనగాడు’ అనూహ్య విజయం సాధించింది. ఈ చిత్రాన్ని హిందీలో ‘హిమ్మత్ వాలా’ పేరుతో జితేంద్ర హీరోగా పద్మాలయా సంస్థనే నిర్మించింది. ఈ చిత్రం ద్వారానే శ్రీదేవికి బాలీవుడ్ లో తొలి ఘనవిజయం లభించింది. ఆ తరువాత హిందీలో శ్రీదేవి ఎంతటి స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారో అందరికీ తెలిసిందే. పద్మాలయా సంస్థ నిర్మించిన హిందీ చిత్రాలకు ఉత్తరాదిన సైతం ఎంతో క్రేజ్ ఉండేది. కృష్ణ దర్శకత్వంలో రూపొందిన “ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, మానవుడు-దానవుడు” వంటి చిత్రాలు సైతం పద్మాలయా పతాకంపైనే రూపొందాయి. కృష్ణ కొన్ని బయటి చిత్రాలకు కూడా దర్శకత్వం వహించినా, పద్మాలయా బ్యానర్ సినిమాలే జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. కృష్ణ నటజీవితంలో రెండు, మూడు బంపర్ హిట్స్ ను మినహాయిస్తే, అన్నీ కూడా పద్మాలయా సంస్థపై నిర్మితమైన చిత్రాలే ఆయనకు మంచి విజయాలను చూపించాయి. అలా కృష్ణ పేరు వింటే పద్మాలయ, ఆ సంస్థ పేరు వింటే కృష్ణ గుర్తుకు వస్తారు. పద్మాలయా పతాకంపై ఓ చిత్రం రూపొందుతుందని, ఆ సినిమాలో కృష్ణ మళ్ళీ కీలక పాత్ర పోషిస్తారని అప్పట్లో వినిపించింది. మరి కరోనా కల్లోలం సమసిపోయాక ఆ ప్రయత్నం సాగుతుందేమో చూడాలి!