ఓ నాటి అందాల తార, తరువాతి రోజుల్లో అందాల బామ్మగా, మామ్మగా నటించిన వహిదా రెహమాన్ మన తెలుగునాటనే వెలుగు చూశారు. ఆమె పుట్టినరోజు ఇప్పటికీ చాలామందికి ఏ రోజో తెలియడం లేదట! స్వయంగా వహిదా రెహమాన్ తన పుట్టినరోజు ఫిబ్రవరి 3వ తేదీ, కానీ, చాలా చోట్ల మే 14 అని ఎందుకు ప్రకటిస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఈ విషయమై కొన్ని వెబ్ సైట్స్ కు వహిదా స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పారట. అయినా, ఇప్పటికీ యేడాదికి రెండు సార్లు అంటే ఫిబ్రవరి 3న, మే 14న ఆమెకు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూనే ఉండడం విశేషం. కొన్ని రోజులు వహిదా అలా యేడాదికి రెండు సార్లు అభినందనలు అందుకోవడానికి ఇబ్బంది పడేవారు. ఎంత చెప్పినా, అభిమానులు ఇప్పటికీ ఆమెను అలాగే అభినందిస్తూ ఉండడంతో అది తన భాగ్యం అని అనుకుంటున్నారట.
తెలుగు చిత్రాలతోనే వెలుగు…
వహిదా 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించారు. ఆమె తండ్రి మొహమ్మద్ అబ్దుర్ రెహమాన్ ఉద్యోగ రీత్యా తెలుగునేలపైనా ఆయన పనిచేశారు. అలా విశాఖపట్టణంలోని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ లో ఆమె చదివారు. చిన్నప్పుడే నాట్యం నేర్చుకున్నారు. వహిదా డాక్టర్ కావాలని కలలు కన్నారు. కానీ, తండ్రి మరణంతో ఆమె నృత్యమే ఆమెకు ఎస్సెట్ గా మారింది. యన్టీఆర్ సొంత సంస్థ ఎన్.ఏ.టి. పతాకంపై అప్పటికే ‘పిచ్చిపుల్లయ్య, తోడుదొంగలు’ వంటి అభ్యుదయ చిత్రాలు తీసి నష్టపోయారు. తరువాతి ప్రయత్నంగా ఓ భారీ జానపదం తీయాలని యన్టీఆర్, ఆయన మిత్రులు భావించారు. అందుకు ‘జయసింహ’ కథ సిద్ధం చేసుకున్నారు. అందులో ఓ నాయికగా అంజలీదేవిని ఎంచుకున్నారు. రాజకుమారి పాత్రలో ఓ కొత్త నటిని నటింప చేయాలన్నది యన్టీఆర్, ఆయన దర్శకుడు డి.యోగానంద్ భావన. అలా యన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు, ఆయన మిత్రులు కలసి వహిదా రెహమాన్ గురించి తెలుసుకొని, ఆమెను తమ చిత్రంలో నాయికగా ఎంచుకున్నారు. ఈ లోగా వహిదా రెహమాన్ నృత్యం గురించి తెలుసుకున్న దర్శకుడు తాపీ చాణక్య తమ ‘రోజులు మారాయి’లో కొసరాజు రాసిన “ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా…” సాంగ్ లో నర్తించడానికి వహిదాను ఎంపిక చేసుకున్నారు. అలా వహిదా రెహమాన్ తెరపై తొలిసారి ‘రోజులు మారాయి’లో తళుక్కుమన్నారు. తరువాత నాయికగా ‘జయసింహ’లో జనం మదిని దోచుకున్నారు. ఎమ్జీఆర్, భానుమతి నటించిన రంగుల చిత్రం ‘ఆలీబాబా 40 దొంగలు’లోనూ ఓ నృత్యగీతంలో మురిపించారు వహిదా.
గురుదత్ తో హిందీ చిత్రసీమలో…
హైదరాబాద్ లో ‘రోజులు మారాయి’ వంద రోజుల వేడుక జరిగింది. ఆ సమయంలో వహిదా డాన్స్ చూసిన గురుదత్ ఆమెను హిందీ చిత్రసీమకు పరిచయం చేయాలని నిర్ణయించారు. దేవానంద్ తో తాను తెరకెక్కించిన ‘సి.ఐ.డి.’ చిత్రంతో వహిదా రెహమాన్ ను హిందీ సినిమా రంగానికి పరిచయం చేశారు గురుదత్. వహిదాలోని నటిని గురుదత్ ఎంతగానో ప్రోత్సహించారు. ఆ తరువాత అనేక విజయవంతమైన హిందీ చిత్రాలలో నటించి మెప్పించారు వహిదా రెహమాన్. 1971లో ‘రేష్మా ఔర్ షేరా’ చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచారు వహిదా రెహమాన్. 1972లో ‘పద్మశ్రీ’, 2011లో ‘పద్మభూషణ్’ అందుకున్నారు వహిదా. తన తొలి హీరో యన్టీఆర్ పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అందించే యన్టీఆర్ నేషనల్ అవార్డును 2006లో సొంతం చేసుకున్నారామె. చాలా రోజుల తరువాత ‘రోజులు మారాయి’ హీరో అక్కినేని నటించిన ‘బంగారు కలలు’లో ఆయనకు సోదరిగా నటించారు వహిదా. ఆ తరువాత 1986లో కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించిన ‘సింహాసనం’లో వహిదా రాజమాతగా అభినయించారు. 2006లో సిద్ధార్థ్ హీరోగా రూపొందిన ‘చుక్కల్లో చంద్రుడు’లో ఏయన్నార్ తో కలసి నటించారామె.
వహిదా రెహమాన్ ను గురుదత్ ఎంతగానో ప్రేమించారు. అయితే, అప్పటికే ఆయనకు వివాహమయింది. ఆ తరువాత గురుదత్ అర్ధాంతరంగా జీవితం చాలించారు. తనతో ‘షగున్’లో హీరోగా నటించిన కమల్ జీత్ ను 1974లో వివాహమాడారు వహిదా రెహమాన్. వారికి ఇద్దరు పిల్లలు. 83 ఏళ్ళు నిండినా ఇప్పటికీ హుషారుగా ఉండే వహిదా రెహమాన్, తన తరం తారలయిన ఆషా పరేఖ్, హెలెన్ తో కలసి ‘దిల్ చాహ్ తా హై’ అంటూ అండమాన్, నికోబార్ దీవుల్లో బోటింగ్ చేసిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తున్నాయి.