Satya Nadella: ప్రపంచంలోని అతి పెద్ద ఐటీ కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ ఒకటి. దానికి తెలుగు సీఈఓ అయిన సత్య నాదెళ్ల లేటెస్టుగా సంస్థ ఉద్యోగులను, ఇన్వెస్టర్లను, కస్టమర్లను, పార్ట్నర్లను ఉద్దేశించి ఒక లెటర్ రాశారు. మైక్రోసాఫ్ట్ యాన్యువల్ రిపోర్ట్-2022లో పబ్లిష్ అయిన ఆ లేఖలో సత్య నాదెళ్ల పేర్కొన్న ఓ విషయం ఆసక్తికరంగా ఉంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఏకైక పరిష్కారం డిజిటల్ టెక్నాలజీయే అని సత్య నాదెళ్ల చెప్పారు. 2021 సంవత్సరానికి కేంద్రం ప్రకటించిన మన దేశ 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్‌ను సత్య నాదెళ్ల 2 వారాల కిందట అమెరికాలో స్వీకరించి వార్తల్లో నిలిచారు. ఈ రెండు అంశాల నేపథ్యంలో ఆయన ఈ వారం మన డిఫైనింగ్ పర్సనాలిటీగా నిలిచారు.
సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టి దాదాపు పదేళ్లు కావొస్తోంది. ఆ సంస్థలో 30 ఏళ్ల కిందట ఒక ఇంజనీర్‌గా చేరిన ఆయన సుమారు 20 ఏళ్లపాటు అంచెలంచెలుగా ఎదిగారు. మేనేజర్‌గా, లీడర్‌గా తనదైన వర్క్ కల్చర్‌ని క్రియేట్ చేశారు. తనకంటూ ఒక మోటోను పెట్టుకొని తూచా తప్పకుండా దాన్నే ఫాలో అయ్యారు.
అన్నీ తెలుసుకోవటం కాదు.. అన్నీ నేర్చుకోవటం ముఖ్యం.. అనే మెసేజ్ ఇచ్చారు. 2014లో సీఈఓ అయిన సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ కంపెనీని సవాళ్ల దశ నుంచి సక్సెస్‌ల స్థాయికి తీసుకొచ్చారు. వినూత్న ఆవిష్కరణకు వేదికగా మలిచారు. తద్వారా.. ఇండియన్ లెజెండ్ అనే లెవల్‌కి చేరుకొని మనందరికీ గర్వకారణమయ్యారు. తెలుగు ప్రజలు ఘనంగా చెప్పుకునేలా చేశారు.
ఈ క్రమంలో సత్య నాదెళ్ల.. మణిపాల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు సాగించిన జర్నీ ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్ అని చెప్పొచ్చు. సత్య నాదెళ్ల పూర్తి పేరు సత్యనారాయణ నాదెళ్ల. ఆయన కుటుంబ నేపథ్యం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం బుక్కాపురం గ్రామం. తండ్రి యుగంధర్ నాదెళ్ల సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. సత్య నాదెళ్ల ప్రైమరీ ఎడ్యుకేషన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరగటం విశేషం.
ఐఐటీలో సీటు కోసం చేసిన ప్రయత్నం విఫలం కావటంతో సత్య నాదెళ్ల 1988లో మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1992లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేశాక మైక్రోసాఫ్ట్‌లో ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించారు. 8 ఏళ్ల అనంతరం మైక్రోసాఫ్ట్ సెంట్రల్‌కి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఒక వైపు జాబ్ చేస్తూనే మరో వైపు ఎంబీఏ పూర్తి చేశారు.
ఏడాది వ్యవధిలోనే మైక్రోసాఫ్ట్ బిజినెస్ సొల్యూషన్స్‌కి కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ పొందారు. ఆరేళ్ల అనంతరం.. 2007లో మైక్రోసాఫ్ట్ ఆన్‌లైన్ సర్వీసెస్‌కి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్స్‌బాక్స్ లైవ్ మరియు బింగ్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. 2011లో అజ్యూర్ క్లౌడ్, విండోస్ సర్వర్, అజ్యూర్ ఎస్ క్యూల్ విభాగాలను పర్యవేక్షించారు.
సత్య నాదెళ్ల నాయకత్వంలో ఈ డివిజన్ల ఆదాయం రెండేళ్లలోనే 3.7 బిలియన్‌లకు చేరింది. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా పగ్గాలు చేపట్టి ప్రపంచవ్యాప్తంగా పేరొందారు. అప్పటి నుంచి ఆయన స్టాక్స్ దాదాపు 650 శాతం పెరగటం చెప్పుకోదగ్గ విషయం. 2015లో మైక్రోసాఫ్ట్ విండోస్-10ని లాంఛ్ చేశారు. అన్ని ప్లాట్‌ఫామ్‌లకూ దీన్ని యూనిఫైడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లా డెవలప్ చేశారు.
ఇవాళ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్ షేర్ ఏకంగా 73 శాతం కావటం అద్భుతమని చెప్పొచ్చు. 2017లో సత్య నాదెళ్ల ‘హిట్ రిఫ్రెష్’ అనే బుక్‌ని పబ్లిష్ చేశారు. ఆ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును పూర్తిగా సేవా కార్యక్రమాలకే కేటాయిస్తున్నారు. 2018లో విండోస్ డెవలప్మెంట్ గ్రూప్‌ని 2 సెగ్మెంట్లుగా విభజించారు. అందులో ఒకటైన ఎం-క్యాప్ విలువ 725 బిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుతం 2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.
సత్య నాదెళ్ల గతేడాది మైక్రోసాఫ్ట్ చైర్మన్ కూడా అయ్యారు. దీంతో 220 మిలియన్ డాలర్ల విలువైన 8.4 లక్షల మైక్రోసాఫ్ట్ షేర్లు ఆయన సొంతమయ్యాయి. అదే సంవత్సరం పద్మ భూషణ్ అవార్డు వరించింది. ఆయన ఇప్పుడు ఇండియాకి వచ్చే అవకాశం లేకపోవటంతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఇండియన్ కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ నుంచి గత నెల 20న పురస్కారాన్ని స్వీకరించారు.
సత్య నాదెళ్ల జనవరిలో ఇండియా పర్యటనకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ వార్షికాదాయం తొలిసారిగా 100 బిలియన్ డాలర్లు దాటిందని సత్య నాదెళ్ల.. కంపెనీ యాన్యువల్ లెటర్‌లో వెల్లడించారు. ప్రపంచ సమస్యలను మైక్రోసాఫ్ట్ డిజిటల్ టెక్నాలజీ ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రకటించి తనలోని సామాజిక స్పృహని చాటుకున్నారు. హ్యాట్సాఫ్ సత్య నాదెళ్ల.