(ఎస్. గోపాల్ రెడ్డి 77వ జయంతి)
అన్నపూర్ణ, సురేశ్, జగపతి వంటి నిర్మాణ సంస్థల సరసన నిలిచిన పతాకం భార్గవ్ ఆర్ట్స్. వినోద ప్రధానమైన కథాబలం ఉన్న చిత్రాలను నిర్మించి, తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి. నేడు ఆయన జయంతి. నెల్లూరు జిల్లా గుణపాటి పాలెంలో ఎస్. గోపాల్ రెడ్డి జూలై 1,1944లో జన్మించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీలో బి.ఎస్.సి. పట్టా పొందారు. అనంతరం పిల్లలు భార్గవ్, పావని చదువు నిమిత్తం చెన్నయ్ కుటుంబంతో చేరారు.
చిరకాల మిత్రుడు కందేపి సత్యనారాయణతో కలిసి అనువాద చిత్రాలను తెలుగులో విడుదల చేయడంతో ఎస్. గోపాల్ రెడ్డి సినీ ప్రస్థానం మొదలైంది. కమల్ హాసన్ ‘చిలిపి మొగుడు’ చిత్రాన్ని తొలుత తెలుగులో విడుదల చేసిన ఈ ద్వయం ఆ తర్వాత మరికొన్ని తమిళ చిత్రాలను తెలుగులో డబ్ చేసింది. తమిళ దర్శకుడు, నటుడు విసు రూపొందించిన ‘కుడుంబం ఒరు కదంబం’ను తెలుగులో భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ పై తొలి యత్నంగా ‘మనిషికో చరిత్ర’ పేరుతో టి.ఎల్.వి. ప్రసాద్ డైరెక్షన్ లో ఎస్. గోపాల్ రెడ్డి రీమేక్ చేశారు. మురళీమోహన్, సుహాసిని నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఎస్. గోపాల్ రెడ్డికి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. ఆ వెంటనే కోడి రామకృష్ణ దర్శకత్వంలో భానుచందర్, సుహాసిని, విజయశాంతి ప్రధాన తారాగణంగా ‘ముక్కుపుడక’ నిర్మించారు. అదీ సూపర్ హిట్. మూడో చిత్రంగా పి. సాంబశివరావు దర్శకత్వంలో సుమన్ తో ‘అపరాథి’ చిత్రం తీశారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన ‘మన్ వాసనై’ మూవీని ఎస్. గోపాల్ రెడ్డి తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘మంగమ్మ గారి మనవడు’ పేరుతో రీమేక్ చేశారు. భానుమతీ రామకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 1984 సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా అఖండ విజయం సాధించింది. హైదరాబాద్ లో 532 రోజులు ప్రదర్శితమైంది. అలా మొదలైన బాలకృష్ణ, కోడి రామకృష్ణ, గోపాల్ రెడ్డి జైత్రయాత్ర తెలుగు సినిమా రంగంలో ఓ చరిత్రగా నిలిచిపోయింది. ఆ తర్వాత ఎస్. గోపాల్ రెడ్డి ఇతర హీరోలతో సినిమాలు తీసినా… ఆయనపై ‘బాలయ్య నిర్మాత’ అనే ముద్ర పడిపోయింది.
‘మంగమ్మగారి మనవడు’ అనంతరం అర్జున్ తో ‘మా పల్లెలో గోపాలుడు’ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత బాలకృష్ణతో ‘ముద్దుల కృష్ణయ్య’ మూవీ తీశారు. అదీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆపైన మరోసారి అర్జున్ తో ‘మన్నెంలో మొనగాడు’ చిత్రం నిర్మించారు. ఇదీ హిట్టే. తనకు అచ్చి వచ్చిన బాలకృష్ణతోనే ఆయన ఆ తర్వాత సూపర్ హిట్ మూవీస్ ‘మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు’ నిర్మించారు. అలానే నాగార్జునతో ‘మురళీ కృష్ణుడు’ చిత్రాన్ని నిర్మించారు.
బాలకృష్ణ – ఎస్. గోపాల్ రెడ్డి కాంబినేషన్లో చివరగా జనం ముందుకు వచ్చిన సినిమా ‘మాతో పెట్టుకోకు’. వరుసగా పెద్ద సినిమాలు నిర్మిస్తూనే, అవకాశం చిక్కినప్పుడల్లా కథాబలం ఉన్న చిన్న చిత్రాలను ప్రొడ్యూస్ చేయడం ఎస్. గోపాల్ రెడ్డి ప్రత్యేకత. కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే 1991లో ‘మధురానగరిలో…’, 1992లో ‘అల్లరి పిల్ల’ చిత్రాలు నిర్మించారు. 1997లో రాజశేఖర్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘రధయాత్ర’ మూవీ నిర్మించారు. అదుపు తప్పిన బడ్జెట్ తో నిర్మితమైన ‘రధయాత్ర’ సినిమా…. ఎస్. గోపాల్ రెడ్డి జైత్రయాత్రకు పెద్ద బ్రేక్ వేసింది. ఆ మధ్యలోనూ ఆయన ‘దాహం… దాహం’, ‘మహానది’ వంటి అనువాద చిత్రాలను తెలుగులో విడుదల చేశారు. గోపాల్ రెడ్డి నిర్మించగా విడుదలైన చివరి చిత్రం వడ్డే నవీన్ హీరోగా నటించిన ‘మా బాలాజీ’. ఆ తర్వాత తన కొడుకు భార్గవ్ హీరోగా నందమూరి బాలకృష్ణ హీరోగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్. గోపాల్ రెడ్డి మొదలు పెట్టిన చిత్రం పూర్తి కాలేదు.
చిత్రసీమలో 90 శాతం సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతగా, అఖండ విజయాలను తన ఖాతాలో జమ చేసుకున్న నిర్మాతగా, నందమూరి బాలయ్యతో కలిసి టాలీవుడ్ లో పలు రికార్డులు నెలకొల్పిన నిర్మాతగా భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి తెలుగు సినిమా రంగంలో చెరగని ముద్ర వేశారు. తన సినిమాల పేరులో మొదటి అక్షరం ‘మ’తో వచ్చేలా ప్లాన్ చేసుకున్న మంచి మనసున్న నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి.