Commercial Vehicles: కమర్షియల్ వెహికిల్స్‌ని ఒక్కో దేశంలో ఒక్కో రకంగా డిఫైన్ చేస్తుంటారు. సహజంగా.. సరుకు రవాణాకు లేదా ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగించే వాహనాలను కమర్షియల్ వెహికిల్స్ అంటారు. ట్రక్కులు, వ్యాన్లు, బస్సులు, ట్యాక్సీలు, ఆటో రిక్షాలు, మోటర్ సైకిల్ ట్యాక్సీలు వంటివాటిని వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మన దేశంలో ఈ వాణిజ్య వాహనాల కొనుగోళ్లు రానున్న కొన్నేళ్లలో భారీగా పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్‌లో 14 – 17 శాతం నుంచి 18 – 19 శాతం వరకు వృద్ధి నమోదవుతుందని ఫిచ్ రేటింగ్స్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా ప్రభావంతో వాణిజ్య వాహనాల కొనుగోళ్లు తగ్గిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో.. అంటే.. 2021-22లో ఈ కేటగిరీ వెహికిల్ సేల్స్ 26 శాతం పుంజుకున్నాయి. దీంతో భవిష్యత్‌పై మళ్లీ ఆశలు రేకెత్తుతున్నాయి. కొవిడ్‌కి ముందు నమోదైన ఓవరాల్ కమర్షియల్ వెహికిల్ సేల్స్‌తో పోల్చితే ఈ 26 శాతం గ్రోత్ తక్కువే. కానీ.. ఇటీవల.. ప్రయాణికుల వాణిజ్య వాహనాల కొనుగోళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఊపందుకున్నాయి.
read more: Indian Smart Watch Market: సరసమైన ధరల వల్లే నంబర్-1 స్థానం: కౌంటర్‌పాయింట్ రిపోర్ట్
కరోనా రోజుల్లో ప్రజలు రోడ్ల మీద తిరగకుండా పెద్దఎత్తున ఆంక్షలు అమల్లో ఉండేవి. విద్య, ఉద్యోగ సంబంధ ప్రయాణాలను రద్దు చేశారు. కాబట్టి.. వాహనాల కొనుగోళ్లు మందగించాయి. కానీ.. ఇప్పుడు అవేవీ లేకపోవటంతో వాణిజ్య వాహనాల కొనుగోళ్ల విషయంలో సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిపోవటంతో మన దేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా, విస్తృతంగా రికవరీ అయింది. అది.. గత ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలో కమర్షియల్ వెహికిల్ సేల్స్ పెరగటానికి బాగా ఉపయోగపడింది.
దీంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 6 నెలల్లో 4 లక్షల 50 వేల వాణిజ్య వాహనాలు సేలయ్యాయి. ఇది.. రెండేళ్ల కిందటి కన్నా.. అంటే.. ప్రి-ప్యాండమిక్ లెవల్ కన్నా 21 శాతం అధికం కావటం గమనించాల్సిన విషయం. సియామ్ అనే ఇండస్ట్రీ గ్రూప్ గణాంకాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్వ స్థాయిలకు చేరుకుంటూ ఉండటం, ప్రభుత్వ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల వ్యయం వృద్ధి చెందుతుండటంతో కమర్షియల్ వెహికిల్స్ వాడకం కూడా మెరుగుపడుతోంది.
ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలోని ప్రథమార్ధం నుంచే సరుకు రవాణా ధరలు పెరిగాయి. తద్వారా గూడ్స్ ఆపరేటర్ల లాభదాయకత సైతం బాగుంది. వీటన్నింటికీతోడు ఫైనాన్స్‌పరంగా కూడా మంచి సదుపాయాలు అందుబాటులో ఉండటంతో ఈమధ్య కొన్ని నెలలుగా కమర్షియల్ వెహికిల్ పర్ఛేజింగ్ మూడ్ నెలకొంది. ఫలితంగా వాణిజ్య వాహనాల కొనుగోళ్లకు పూర్వ వైభవం రానుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.