Site icon NTV Telugu

Lightning Strikes: ఆకాశంలో విమానంపై పిడుగు పడితే ఏమవుతుందో తెలుసా? ఆసక్తికర నిజాలు ఇవే!

Air Flight

Air Flight

Lightning Strikes: థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి బెంగళూరు వస్తున్న అకాసా ఎయిర్‌లైన్స్ (QP 624) విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణంలో ఉండగా విమానంపై పిడుగు పడటంతో పైలట్లు అప్రమత్తమై, విమానాన్ని అత్యవసరంగా చెన్నైకి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే, ఆధునిక సాంకేతికత వల్ల విమానాలు పిడుగుపాటును ఎలా తట్టుకుంటాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Nara Lokesh : ఇది తెలుగుదేశం పార్టీ 3.O వర్షన్

ఏడాదికి ఒకసారి ప్రతి విమానంపై పిడుగు పడుతుందా..
నిపుణుల అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వాణిజ్య విమానంపై ఏడాదికి కనీసం ఒక్కసారైనా పిడుగు పడుతుంది. ఉరుములు, మెరుపుల మధ్య ప్రయాణించేటప్పుడు ఇది చాలా సాధారణ విషయం. కానీ, ఇంజనీరింగ్ అద్భుతాల వల్ల విమానాలు గాలిలో ఒక ‘రక్షణ కవచం’లా పనిచేస్తాయి. సాధారణంగా మెరుపు విమానం యొక్క ముక్కు (Nose) లేదా రెక్కల కొనల వంటి పదునైన భాగాలను తాకుతుంది. ఆ విద్యుత్ విమానం బయటి బాడీ గుండా ప్రయాణించి తోక భాగం నుండి బయటకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో విమానం లోపల ఉన్న వారికి ఒక పెద్ద ‘బాంగ్’ శబ్దం వినిపించడం లేదా ప్రకాశవంతమైన వెలుగు కనిపించడం జరుగుతుంది. పిడుగు కారణంగా విమానం లోపల ఉన్న వారికి విద్యుదాఘాతం (Electric Shock) తగలదు. ఎందుకంటే విమానం బాడీ విద్యుత్తును లోపలికి రానివ్వదు.

విమానాన్ని రక్షించేది ఇదే..
విమానాలు సురక్షితంగా ఉండటానికి భౌతిక శాస్త్రంలోని ‘ఫారడే కేజ్’ సూత్రం ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. పాత విమానాలు అల్యూమినియంతో తయారవుతాయి. ఇది విద్యుత్ వాహకం కావడంతో మెరుపును బయటి పొరకే పరిమితం చేస్తుంది. బోయింగ్ 787 లేదా ఎయిర్‌బస్ A350 వంటి విమానాలు కార్బన్ ఫైబర్‌తో తయారవుతాయి. ఇవి విద్యుత్తును ప్రసరింపజేయవు కాబట్టి, వీటి బాడీ లోపల ప్రత్యేకంగా రాగి జాలీ పొరను అమర్చుతారు. ఇది విద్యుత్తును సురక్షితంగా బయటకు పంపుతుంది. రెక్కల్లో ఉండే ఇంధనం వద్ద మంటలు చెలరేగకుండా ఉండేందుకు ట్యాంక్ చుట్టూ మందపాటి లోహపు పొరను, కీళ్ల వద్ద ప్రత్యేక సీలింగ్‌ను ఉపయోగిస్తారు. విమానం రెక్కల వెనుక భాగంలో చిన్న కడ్డీలు లేదా సూదుల్లాంటివి కనిపిస్తాయి. వీటిని ‘స్టాటిక్ డిశ్చార్జర్లు’ అంటారు. విమానంపై పేరుకుపోయిన అదనపు విద్యుత్ ఆవేశాన్ని ఇవి నిరంతరం గాలిలోకి విడుదల చేస్తూ, పిడుగు పడే అవకాశాన్ని తగ్గిస్తాయి.

సంక్షోభంలో పైలట్ల పాత్ర
పిడుగు పడినప్పుడు పైలట్లు ఏమాత్రం భయపడకుండా కొన్ని చర్యలు తీసుకుంటారు. ఒక వేళ ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంపై పిడుగు పడితే పైలట్లు వెంటనే నావిగేషన్, కమ్యూనికేషన్, ఇంజిన్ కంట్రోల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తారు. తుఫాను తీవ్రతను రాడార్‌లో గమనిస్తూ సురక్షిత మార్గంలోకి విమానాన్ని మళ్లిస్తారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఇంజినీర్లు బాడీపై ఎక్కడైనా చిన్న రంధ్రాలు లేదా కాలిన గుర్తులు ఉన్నాయేమో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. 1963 తర్వాత విమానాల భద్రతా ప్రమాణాలు అత్యంత కఠినతరం కావడంతో, గత 60 ఏళ్లలో పిడుగుపాటు వల్ల ఎటువంటి పెద్ద విమాన ప్రమాదాలు జరగలేదు. అకాసా ఎయిర్ ఘటనలో కూడా సాంకేతికత, పైలట్ల సమయస్ఫూర్తి వల్ల ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

READ ALSO: China: సముద్రగర్భంలో చైనా ‘సైనిక’ వేగులు.. అమెరికా స్థావరాలే టార్గెట్!

Exit mobile version