(మే 11న హీరో సుధీర్ బాబు బర్త్ డే)
హీరో సుధీర్ బాబును చూడగానే, స్పోర్ట్స్ మేన్ అని ఇట్టే పసిగట్టేయ వచ్చు. టాలీవుడ్ యంగ్ హీరోస్ లో సుధీర్ బాబు తరహా ఫిట్ బాడీ అరుదు అనే చెప్పాలి. అసలు అతని వయసు నాలుగు పదులు అంటే నమ్మలేం. సినిమా రంగంలో అడుగుపెట్టక ముందు బ్యాడ్మింటన్ ప్లేయర్ గా రాణించాడు సుధీర్. ఎంతోమంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ను తీర్చిదిద్దిన పుల్లెల గోపీచంద్ తో కలసి డబుల్స్ ఆడేవాడు సుధీర్. నటశేఖర కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శినిని పెళ్ళాడిన సుధీర్ కు అనుకోకుండా సినిమాలపై ఆసక్తి కలిగిందని చెప్పవచ్చు. తన భార్య ఇంటిలో ఆమె తండ్రి, అన్నలు, అక్క మంజుల అందరూ నటనలో ప్రవేశమున్నవారే. దాంతో సుధీర్ మనసు కూడా యాక్టింగ్ వైపు సాగింది. తన వదిన మంజుల ఘట్టమనేని నిర్మించిన ‘ఏ మాయ చేశావే’తో సుధీర్ తొలిసారి తెరపై కనిపించాడు. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో రూపొందిన ‘ఏ మాయ చేశావే’ లో సమంత అన్నగా సుధీర్ నటించాడు. ఓ సీన్ లో హీరో నాగచైతన్యతో ఫైట్ కూడా చేస్తాడు. ఆ తరువాత ‘శివ మనసులో శ్రుతి’ (ఎస్.ఎమ్.ఎస్.) సినిమాలో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. ఈ చిత్రంలోనే ఫైట్స్, డాన్సులతో ఆకట్టుకున్నాడు సుధీర్.
సుధీర్ కు తొలి రెండు సినిమాలు నటునిగా మార్కులయితే సంపాదించి పెట్టాయి. కానీ, అతను ఆశించిన విజయం దరి చేరలేదు. సినిమాటోగ్రాఫర్ జె.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో మారుతి నిర్మించిన ‘ప్రేమ కథాచిత్రమ్’ సుధీర్ బాబు ఆశించిన విజయాన్ని అందించింది. తక్కువ పెట్టుబడితో రూపొందిన ‘ప్రేమకథా చిత్రమ్’ మంచి లాభాలను చూసింది. ఇందులో తన మామ కృష్ణ హీరోగా నటించిన ‘పచ్చని కాపురం’లోని “వెన్నెలైనా చీకటైనా…” సాంగ్ రీమిక్స్ లో నటించి అలరించాడు సుధీర్. ‘ప్రేమకథాచిత్రమ్’ ఘనవిజయం తరువాత సుధీర్ బాబుకు పలు అవకాశాలు పలకరించాయి. అయితే ఆచి తూచి అడుగేస్తూ తన పర్సనాలిటీకి తగ్గ పాత్రలనే ఎంచుకున్నాడు సుధీర్. “ఆడు మగాడ్రా బుజ్జి, క్రిష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, మోసగాళ్లకు మోసగాడు, భలే మంచి రోజు, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే” వంటి చిత్రాలలో సోలో హీరోగా ఆకట్టుకున్న సుధీర్, “శమంతకమణి, వీరభోగవసంతరాయలు, వి” చిత్రాలలో ఇతర హీరోలతోనూ కలసి నటించి అలరించాడు. వీటిలో ‘నన్ను దోచుకుందువటే’ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించాడు సుధీర్. మేచో మేన్ లుక్ ఉన్న సుధీర్ బాబుకు హిందీలో ‘బాఘీ’ చిత్రంలో విలన్ గా నటించే అవకాశం లభించింది. తెలుగులో విజయం సాధించిన ‘వర్షం’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించాడు. ‘బాఘీ’లో టైగర్ కు తగ్గ విలన్ అనిపించుకున్నాడు సుధీర్. తగిన పాత్ర దొరకాలే కానీ, తన సత్తా చాటుకుంటానని పలుమార్లు నిరూపించుకున్నాడు సుధీర్.
కృష్ణ లాంటి సీనియర్ స్టార్ అల్లుడు, ఇప్పటి టాప్ హీరో మహేశ్ బాబు బావమరిది అయినా సుధీర్ ఏ రోజునా, భేషజాలకు పోలేదు. తన మనసుకు నచ్చితే చిన్న పాత్రలోనైనా నటించడానికి వెనుకాడలేదు సుధీర్. అలా కొన్ని చిత్రాలలో కేమియో రోల్స్ లోనూ అలరించాడు సుధీర్.
ప్రస్తుతం సుధీర్ బాబు “శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” వంటి చిత్రాలలో నటిస్తున్నాడు. తన గురువు, మిత్రుడు అయన పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తానని చెప్పాడు సుధీర్. ఆ చిత్రాన్ని ఏకంగా తెలుగు, హిందీ భాషల్లో నిర్మించే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఈ సినిమాలతో సుధీర్ బాబు ఏ తీరున జనాన్ని మురిపిస్తాడో చూడాలి.