(మే 1న దర్శకుడు సి.ఎస్.రావు జయంతి)
మేటి దర్శకుల తనయులు సైతం తండ్రుల బాటలో పయనించి జయకేతనం ఎగురవేయడం అన్నది అరుదుగా జరుగుతూ ఉంటుంది. తెలుగు సినిమా రంగంలో పలు మరపురాని చిత్రాలు అందించిన సి.పుల్లయ్య తనయుడు సి.ఎస్.రావు అలాంటి అరుదైన వారిలో ఒకరు! ఆయన పూర్తి పేరు చిత్తజల్లు శ్రీనివాసరావు. సి.ఎస్.రావు తండ్రి బాటలో పయనించి, దర్శకత్వంలో తనదైన బాణీ పలికించారు. తండ్రిలాగే దర్శకునిగా విజయపథంలో పయనించారు. తండ్రి, కొడుకు ఇద్దరూ కలసి రూపొందించిన ‘లవకుశ’ రంగుల చిత్రం ఈ నాటికీ జనం చేత జేజేలు అందుకుంటూనే ఉంది.
యన్టీఆర్ తో విజయభేరి!
తెలుగు సినిమా తొలినాళ్ళలో వెలుగు చూసిన దర్శకుల్లో చిత్తజల్లు పుల్లయ్య స్థానం ప్రత్యేకమైనది. జానపద, పౌరాణిక, సాంఘికాలతో ఆయన ప్రేక్షకులను రంజింపచేశారు. ఆయన తనయుడు సి.ఎస్.రావు తండ్రి వద్దనే అసోసియేట్ గా పనిచేసి, ‘పొన్ని’ అనే తమిళ చిత్రంతో దర్శకుడయ్యారు. తన తండ్రి తెరకెక్కించిన ‘పక్కయింటి అమ్మాయి’కి కూడా పనిచేశారు. ఆ తరువాత యన్టీఆర్ తో సి.ఎస్.రావు తెరకెక్కించిన “అన్న-తమ్ముడు, మంచిమనసుకు మంచిరోజులు, శభాష్ రాముడు” చిత్రాలు మంచి విజయం సాధించడంతో సి.ఎస్.రావు పేరు తెలుగునాట మారుమోగి పోయింది. అందరూ సి.ఎస్.రావును తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడారు. యన్టీఆర్ తో ఎక్కువ చిత్రాలను రూపొందించిన దర్శకుల్లో సి.ఎస్.రావు ఒకరిగా నిలిచారు. రామారావుతో సి.ఎస్.రావు “టైగర్ రాముడు, వాల్మీకి, కంచుకోట, నిలువుదోపిడి, నిండుసంసారం, ఏకవీర, పెత్తందార్లు, మారిన మనిషి, జీవితచక్రం, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, దేశోద్ధారకులు, ధనమా?దైవమా?, మంచికి మరోపేరు” వంటి చిత్రాలు తెరకెక్కించారు. ఈ చిత్రాలలో అత్యధిక శాతం విజయం సాధించినవే కావడం విశేషం. ఒకటి రెండు చిత్రాలు మినహాయిస్తే, యన్టీఆర్, సి.ఎస్.రావు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ జనాన్ని రంజింప చేశాయి. ముఖ్యంగా రిపీట్ రన్స్ లోనూ జయభేరీ మోగించాయి. తండ్రి సి.పుల్లయ్యతో కలసి సి.ఎస్.రావు రూపొందించిన ‘లవకుశ’ ఈ నాటికీ ఏ నాటికీ చెరిగిపోని, తరిగిపోని చరిత్రను సొంతం చేసుకున్న పౌరాణికంగా రికార్డు సృష్టించింది. 1967లో వచ్చిన ‘కంచుకోట’ చిత్రం రిపీట్ రన్ లోనూ శతదినోత్సవం జరుపుకున్న జానపదంగా నిలచింది. ఇక యన్టీఆర్ తొలి రంగుల సాంఘిక చిత్రం ‘దేశోద్ధారకులు’ 1973లో వసూళ్ళ వర్షం కురిపించి, ఆ యేడాది టాప్ హిట్స్ లో ఒకటిగా జయకేతనం ఎగురవేసింది. మిగిలిన చిత్రాల్లోనూ అనేకం అనూహ్య విజయాలను సాధించినవే ఉన్నాయి. అలా యన్టీఆర్ తో సి.ఎస్.రావు చాలాకాలం జైత్రయాత్ర చేయడం విశేషం!
ఏయన్నార్ తోనూ సి.ఎస్.రావు విజయాలను చవిచూశారు. వారిద్దరి కాంబినేషన్ లో “శ్రీకృష్ణమాయ, అభిమానం, శాంతినివాసం, గోవుల గోపన్న, బంగారుగాజులు, రంగేళి రాజా, మహాకవి క్షేత్రయ్య” చిత్రాలు వచ్చాయి. ఇక సి.ఎస్.రావు దర్శకత్వంలో రూపొందిన “పెళ్ళికాని పిల్లలు, ప్రతిజ్ఞాపాలన, కీలుబొమ్మలు, రెండు కుటుంబాల కథ, అనగనగా ఓ తండ్రి, అల్లరి పిల్లలు, యశోదకృష్ణ” మొదలైన చిత్రాలూ అలరించాయి.
నటునిగా…
సి.ఎస్.రావు నటునిగానూ అనేక చిత్రాలలో కనిపించారు. బాల్యంలోనే తన తండ్రి సి.పుల్లయ్య రూపొందించిన “అనసూయ, ధ్రువ” వంటి చిత్రాలలో నటించిన సి.ఎస్.రావు తరువాతి రోజుల్లో, “ఇంట్లో రామయ్య-వీధిలో క్రిష్ణయ్య, జేబుదొంగ, కోకిల” వంటి చిత్రాలలో కనిపించారు. అనేక సినిమాల్లో అతిథి పాత్రల్లోనూ అభినయించారు.
మహానటి కన్నాంబ, దర్శకులు కడారు నాగభూషణం దంపతుల కూతురును సి.ఎస్.రావు వివాహం చేసుకున్నారు. ఆమె మరణం తరువాత నటి, నర్తకి రాజసులోచనను పెళ్ళాడారు సి.ఎస్.రావు. వారికి ఇద్దరు కవలపిల్లలు. సి.ఎస్.రావు దర్శకత్వం వహించిన అనేక చిత్రాలలో రాజసులోచన హీరోయిన్ గానూ, కేరెక్టర్ యాక్టర్ గానూ నటించి అలరించారు. ఏది ఏమైనా సి.ఎస్.రావు రూపొందించిన చిత్రాలు ఆ రోజుల్లో ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకున్నాయి. తెలుగు చిత్రసీమ మేటి దర్శకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించారు సి.ఎస్.రావు. దర్శకుల వారసుల్లో సి.ఎస్.రావులాగే ఆ తరువాత విజయం సాధించినది కె.ఎస్. ప్రకాశరావు తనయుడు కె.రాఘవేంద్రరావు అనే చెప్పాలి.