NTV Telugu Site icon

Bahishkarana Web Series Review: బహిష్కరణ రివ్యూ

Bahishkarana

Bahishkarana

Bahishkarana Web Series Zee5 Review: అంజలి ప్రధాన పాత్రలో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ళ కీలక పాత్రలలో నటించిన వెబ్ సిరీస్ బహిష్కరణ. ముఖేష్ ప్రజాపతి అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ నిన్న రాత్రి నుంచి జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి నేషనల్ ఓటీటీ చైన్స్ కూడా ఇప్పుడు తెలుగు కంటెంట్ కోసం ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా తెలుగు వెబ్ సిరీస్ లు వచ్చాయి. అందులో భాగంగానే ఈ బహిష్కరణను కూడా తీసుకొచ్చారు. టీజర్, ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

బహిష్కరణ కథ:
పెద్దపల్లి అనే గ్రామంతో పాటు చుట్టుపక్కల పది ఊళ్లకు ప్రెసిడెంట్ శివయ్య (రవీంద్ర విజయ్) ఏక చత్రాధిపత్యం చెలాయిస్తూ ఉంటాడు. అయితే ఊరూరూ తిరిగి వేశ్య వృత్తి చేసుకునే పుష్ప (అంజలి) అందచందాలకు ముగ్ధుడైన శివయ్య ఊరి చివర ఉన్న తన తోట ఇంట్లో ఉంచుతాడు. అతనికి ఉంపుడుగత్తెగా ఉన్న పుష్ప అందచందాల మీద అతని వెనక ఉండే వ్యక్తి కన్ను పడింది. అతను లొంగదీసుకోవాలని ప్రయత్నం చేసినా శివయ్యకు కుడి భుజం లాంటి దర్శి (శ్రీతేజ్) చూపించిన ప్రేమకు పుష్ప అతని మీద మనసు పడుతుంది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుని అంతా సిద్ధం అయ్యాక శివయ్య దర్శిని తన మరదలు లక్ష్మి (అనన్యా నాగళ్ల) మెడలో తాళి కట్టే పరిస్థితి ఏర్పడేలా చేస్తాడు. అయితే పుష్పను ప్రేమించి, పెళ్లి చేసుకోవాలనుకున్న దర్శి… చివరకు మరదల్ని చేసుకోవాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది? ఆ తర్వాత దర్శి ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? ఊరిలో దర్శి సామాజిక వర్గానికి చెందిన ఆడపిల్లలు ఎందుకు వరుసగా మృత్యువాత పడుతున్నారు? వారి మరణాలకు కారణం ఎవరు? లక్ష్మిని దర్శి పెళ్లి చేసుకున్నాక పుష్ప ఏం చేసింది? జైలు నుంచి వచ్చాక దర్శి ఏం చేశాడు? లాంటి విషయాలు తెలియాలంటే సిరీస్ ఒకసారి చూడాల్సిందే.

విశ్లేషణ:
ఇది 90ల కాలంలో జరిగినట్టుగా అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టేలా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఇప్పుడు కాలక్రమేణా కులమతాల పట్టింపులు తక్కువయ్యాయి కానీ, పాతికేళ్ల క్రితం? అదీ పల్లెల్లో? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అనే విషయాలను చిన్న చిన్న అంశాలను కూడా సునిశితంగా డైలాగ్స్ వాడకుండా చూపిన తీరు ఆకట్టుకునేలా ఉంది. తక్కువ కులం పేరుతో మనుషుల్ని కనీసం ముట్టుకోకుండా అంటరాని వాళ్లుగా చూడటం వంటి విషయాలను చూపిస్తూనే ఇంట్లోకి రానివ్వడానికి అడ్డొచ్చిన కులం… అమ్మాయిల్ని తమ పక్కలోకి రానివ్వడానికి, పడక సుఖం అనుభవించడానికి ఏ మాత్రం అడ్డు రాకపోవడం వంటి విషయాన్ని కుండబద్దలు కొట్టేలా చూపించారు. ఇక ఈ మధ్య చర్చజరుగుతున్న పీడోఫైల్స్ అంశాన్ని కూడా స్పృశించారు. నిజానికి ఈ సిరీస్ కథ కొత్తగా ఉందని అనలేం కానీ తర్వాత ఏం జరుగుతుందని ఉత్కంఠతో, ఆసక్తిగా ఎదురు చూసేలా ఉందని చెప్పక తప్పదు. ముఖేష్ ప్రజాపతి కొన్ని సన్నివేశాలను రా అండ్ రస్టిక్ ఫీల్ వచ్చేలా తెరకెక్కించాడు. పలు సన్నివేశాల్లో డైలాగులు లేకుండానే అంతర్లీనంగా అర్ధం అయ్యేలా ఆయన కొన్ని కళ్ళకు కట్టిన విధానం బాగుంది. ఇక కొన్ని సీన్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. నిజానికి ఈ క్యారెక్టర్లను మనం ముందే ఎక్కడో చూసినట్టు అనిపించినా మనల్ని సిరీస్ చూస్తున్నట్టు కాకుండా ఆ ఊరిలోకి తీసుకుపోయినట్టు లీనం అయ్యేలా చేసిన విధానం బాగుంది. శ్యామ్ చెన్ను సంభాషణలు ఆలోచింపచేసేలా ఉన్నాయి. సిద్ధార్ద్ సదాశివుని నేపథ్య సంగీతం సిరీస్ కి సెట్ అయింది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేక అభినందనలు చెప్పాల్సిందే అనేలా వారి పని తీరు ఉంది.

నటీనటుల విషయానికి వస్తే వేశ్య‌గా బోల్డ్ పాత్రలో అంజ‌లి అద‌ర‌గొట్టింది. వేశ్య‌గా, ప్రియుడి ప్రేమ కోసం ప‌రిత‌పించే ప్రియురాలిగా ఆమె వేరియేష‌న్స్ పలికించడమే కాదు క్లైమాక్స్‌లో న‌ట విశ్వ‌రూపం చూపించింది. ద‌ర్శిగా శ్రీతేజ్ కి చాలా రోజుల తరువాత మంచి పాత్ర పడింది. ఇక రవీంద్ర విజయ్ ఎప్పటిలాగే అదరగొట్టాడు. ల‌క్ష్మి పాత్ర‌లో అన‌న్య నాగ‌ళ్ల నాచుర‌ల్ గా అనిపించింది.

ఇక ఫైనల్లీ ఈ బహిష్కరణ రా అండ్ రస్టిక్ థ్రిల్లర్.. ఫ్యామిలీలతో కలిసి చూడడం అవాయిడ్ చేయడం మంచిది.