హృతిక్ రోషన్, జూనియర్ ఎన్‌టీఆర్ కీలక పాత్రలలో నటిస్తున్న వార్ 2 సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. జూనియర్ ఎన్‌టీఆర్ మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయిగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం కావడంతో, ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు. స్పై యూనివర్స్‌లో ఆరవ సినిమాగా, వార్ సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ: కబీర్ (హృతిక్ రోషన్) ఒక ప్రతిభావంతమైన RAW ఏజెంట్ నుంచి ఫ్రీలాన్స్ కాంట్రాక్ట్ కిల్లర్‌గా మారి, హై-ప్రొఫైల్ వ్యక్తులను టార్గెట్ చేస్తాడు. ఇదే సమయంలో, శక్తివంతమైన ఐదు దేశాల వ్యాపారవేత్తలు కలిసి ‘కాళీ’ అనే కార్టెల్‌ను ఏర్పాటు చేసి, భారత దేశ అభివృద్ధిని అడ్డుకోవాలనే యత్నం మొదలుపెడతారు. కబీర్‌నే సరైన వ్యక్తి అని నమ్మిన కాళీ, అతనికి ఒక మిషన్ అప్పగిస్తుంది. ఈ క్రమంలో, కబీర్ తన గురువు, RAW చీఫ్ లుత్రా (అశుతోష్ రాణా)ను హత్య చేయడం ఏజెన్సీని షాక్‌కు గురిచేస్తుంది. వెంటనే RAW కొత్త ఏజెంట్ విక్రం చలపతి (జూనియర్ ఎన్టీఆర్)ను కబీర్‌ను ఆపేందుకు పంపిస్తారు. అయితే, ఈ చేజ్ మధ్యలో కబీర్, విక్రం చిన్నప్పటి స్నేహితులు అన్న విషయం వెలుగులోకి వస్తుంది. అసలు రోగ్ ఏజెంట్ ఎవరు? కబీర్ ఎందుకు తిరుగుబాటు చేశాడు? కాళీ కార్టెల్ భారత ప్రధాని హత్య యత్నంలో విజయం సాధిస్తుందా? అనేవి తెలియాలంటే బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే…
విశ్లేషణ: జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు అంటే ఆ సినిమా మీద ఆయన అభిమానుల్లోనే కాదు తెలుగు సినీ ప్రేక్షకులలో సైతం భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేశారు. నిజానికి హృతిక్ రోషన్ ఎంట్రీ కూడా ఒక లెవల్లో ఉంది. అయితే ఎంట్రీ సీన్స్ తో దుమ్మురేపిన తర్వాత రెగ్యులర్ స్పై ఫార్మాట్ లోకి సినిమా ఎంటర్ అవుతుంది. అయితే కథాంశం గత స్పై యూనివర్స్ సినిమాల నుండి కొంత భిన్నంగా ఉంది. అయితే భిన్నంగా ఉన్నా దాన్ని ఇంకా బాగా ప్రజెంట్ చేసే అవకాశం ఉన్నా కూడా ఎందుకో పూర్తిగా అలా చేయలేక పోయినట్లు అనిపించింది. కథ భిన్నంగా ఉన్నప్పటికీ, ఇతర స్పై యూనివర్స్ సినిమాల టెంపో కొనసాగుతుంది. అది సినిమాని చాలా ఆర్డినరీగా, రొటీన్ ఫీల్ తీసుకొస్తుంది. నిజానికి సినిమాకి మంచి సెటప్ రెడీ చేశారు, అది కొంతవరకు సినిమాను భిన్నంగా ఉంచేలా చేసింది. సినిమాలో ఇద్దరు లీడ్ యాక్టర్స్ ఎంట్రీలు, కొన్ని బ్లాక్స్, అలాగే ట్విస్ట్ లు కూడా బాగా వర్క్ అవుట్ అయ్యాయి. డ్యాన్స్ నెంబర్స్ కూడా బాగున్నాయి. అయితే సినిమాలో ఎమోషన్ వర్కట్ కాలేదు అనే ఫిలింగ్ కలుగుతుంది. ఎక్కడ అయితే హై రావాలో అక్కడ అది మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ ఇద్దరూ అదరగొట్టారు. వారి పాత్రలకు తగినట్లుగా ఆకట్టుకున్నారు, కానీ వారు ఇంతకు ముందు చేయనిది విషయాలు అయితే ఏమీ లేవు. క్లైమాక్స్‌లో వారి నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే నిర్మాణ విలువలు బాగున్నాయి, కానీ కొన్ని VFX షాట్లు, ముఖ్యంగా బోట్ చేజ్ సీన్ లో తేలిపోయినట్టు తెలుస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మంచి కిక్ ఇస్తుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి మంచి రిచ్ లుక్ తీసుకొచ్చింది. నిడివి విషయంలో కూడా కేర్ తీసుకుని ఉండచ్చు.
ఫైనల్లీ War 2 ఒక రొటీన్ స్పై యాక్షన్ థ్రిల్లర్, విత్ స్టైలిష్ మేకింగ్..