NTV Telugu Site icon

Vaarasudu Review: వారసుడు మూవీ రివ్యూ (తమిళ డబ్బింగ్)

Vaarasudu Movie Review

Vaarasudu Movie Review

సినిమాలకు కథలు కరువైనప్పుడు పురాణాల్లోకి తొంగిచూడు అన్నది ఓ పురాతన సిద్ధాంతం. ఈ సూత్రాన్ని తు.చ. తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ఎందరో దర్శకులు పాటిస్తూనే ఉన్నారు. పురాణాలతో పాటు షేక్స్ పియర్ ను అధ్యయనం చేయడమూ ఓ సంప్రదాయం. దీనిని పాశ్చాత్యులే కాదు భారతీయులూ అనుసరిస్తూ ఉంటారు. షేక్స్ పియర్ ను మన తెలుగు దర్శకులు సైతం అనేక పర్యాయాలు అనుసరించారు. షేక్స్ పియర్ ‘కింగ్ లియర్’ ను ఆ నాటి కేవీ రెడ్డి ‘గుణసుందరి కథ’గా మలిచారు. తరువాత అదే కథను కూతుళ్ళ స్థానంలో కొడుకులుగా మార్చి అనేక భారతీయ సినిమాలు రూపొందాయి. ప్రఖ్యాత జపాన్ దర్శకుడు అకిరా కురసోవా సైతం ‘కింగ్ లియర్’ కథలోని కూతుళ్ళ స్థానంలో తనయులను జోడించి ‘ర్యాన్’ మూవీ తెరకెక్కించారు. ఓ తండ్రికి ముగ్గురు కొడుకులు ఉండడం, చిన్నకొడుకును తండ్రి అశ్రద్ధ చేసినా, అతడే కుటుంబగౌరవాన్ని నిలిపినట్టుగా పలు కథలు వెలుగు చూసి మెప్పించాయి. ఆ కోవలో వెంకటేశ్ ‘సూర్యవంశం’, ‘గౌతమ్ ఎస్.ఎస్.సి’ వంటి చిత్రాలు వచ్చాయి. అదే తీరున విజయ్ తాజా చిత్రం ‘వారిసు’ అనువాదం ‘వారసుడు’ ఉందని మొదటి నుంచీ వినిపిస్తోంది. ఈ సినిమాను తమిళ స్టార్ హీరో విజయ్ తో తెలుగు నిర్మాత దిల్ రాజు, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళంలో నిర్మించడం విశేషం!

ఇంతకూ ‘వారసుడు’ కథ ఏమిటంటే – బిజినెస్ టైకూన్ రాజేంద్రకు ముగ్గురు కొడుకులు జై, అజయ్, విజయ్. చిన్నవాడయిన విజయ్ తమ ఫ్యామిలీ బిజినెస్ లో పాలుపంచుకోనని చెప్పినందుకు తండ్రి అతడిని దూరం పెడతాడు. అసలు అతడిని కొడుకుగా ఎవరికీ చెప్పనంత కోపంతో ఉంటాడు. విజయ్ మాత్రం ఇంట్లోంచి బయటకు వెళ్ళినా, తన స్వశక్తితో ఓ ‘ఫుడ్ స్టార్టప్’ను ఏర్పాటు చేసి తనదైన పంథాలో సాగుతుంటాడు. రాజేంద్రకు తాను ఎక్కువ రోజులు బ్రతకనని తెలుస్తుంది. దాంతో తన తరువాత ఛైర్మన్ పదవిని పెద్దకొడుకులు ఇద్దరిలో ఎవరికి అప్పగించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన 65వ పుట్టినరోజుకు అందరూ వస్తారు. తల్లి పిలుపుపై విజయ్ కూడా హాజరవుతాడు. విజయ్ ని అతని వదిన చెల్లెలు దివ్య ప్రేమిస్తూ ఉంటుంది. రాజేంద్ర పెద్దకొడుకుల వల్లే ఆయన వ్యాపారం దెబ్బతింటుంది. ప్రత్యర్థులకు కూడా వారు లొంగిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ తన కుటుంబాన్ని ఎలా చక్కదిద్దాడు? తండ్రికి తగ్గ వారసుడు అని ఎలా అనిపించుకున్నాడు? అన్నదే మిగిలిన కథ.

నవతరం భావాలకు అనువుగా ఉన్న పాత్రల్లో విజయ్ నటించడం కొత్తేమీ కాదు. ఆయన తనదైన పంథాలో విజయ్ కేరెక్టర్ ను పోషించారు. రష్మిక అందం కొన్ని చోట్ల బంధాలు వేసింది. తండ్రి పాత్రలో శరత్ కుమార్, తల్లిగా జయసుధ తమ అనుభవం ప్రదర్శించారు. మిగిలిన వారిలో ప్రకాశ్ రాజ్ ప్రతినాయకునిగా తన మార్కు చూపారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందడం వల్ల తమిళవాసన కంటే తెలుగు బాణీయే ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది. పైగా పలు పాత తెలుగు చిత్రాలూ గుర్తుకు వస్తాయి. థమన్ బాణీల్లో రూపొందిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. పాటల్లో “రంజితమే…” మురిపిస్తుంది. దిల్ రాజు ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారు.

ప్లస్ పాయింట్స్:
– విజయ్, రష్మిక సినిమా కావడం
– యోగిబాబు కామెడీ
– మేకింగ్ వేల్యూస్
– థమన్ బాక్గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:
– కథలో కొత్తదనం లేకపోవడం
– సాగదీసినట్టుగా ఉన్న సన్నివేశాలు

రేటింగ్: 2.75/5

ట్యాగ్ లైన్: మరో ‘వారసుడు’!