మహారాజా లాంటి హిట్ కొట్టి కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు తమిళ నటుడు విజయ్ సేతుపతి. అలాంటి విజయ్ సేతుపతి హీరోగా, నిత్యా మీనన్ హీరోయిన్‌గా, తమిళ దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో తలైవా తలైవి అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని తెలుగులో సార్ మేడమ్ పేరుతో, తమిళంలో రిలీజ్ అయిన జూలై 25నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, ఇక్కడ హరిహర వీరమల్లు రిలీజ్ అవుతూ ఉండడంతో పాటు, డబ్బింగ్ వర్క్స్ ఇంకా పూర్తి కాకపోవడంతో, ఈ సినిమాని ఆగస్టు ఒకటవ తేదీన రిలీజ్ చేశారు. నిజానికి, తమిళంలో ఈ సినిమా విజయ్ సేతుపతి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. దీంతో, సినిమా ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. మరి, ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూ లో చూద్దాం.
సార్ మేడమ్ కథ:
ఆకాశవీరుడు (విజయ్ సేతుపతి) తన ఫ్యామిలీతో కలిసి ఒక హోటల్ నడుపుతూ ఉంటాడు. పరోటా మాస్టర్ అయిన అతన్ని డబుల్ ఎం.ఏ. అని చెప్పి, పెళ్లి సంబంధం సెట్ చేసే పనిలో పడతారు అతని కుటుంబ సభ్యులు. అందులో భాగంగానే, పక్క ఊరికి చెందిన మహారాణి (నిత్యా మీనన్) ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు. మొదటి చూపులోనే ఒకరికొకరు నచ్చడంతో, పెళ్లి నిశ్చయమవుతుంది. అయితే, తన చదువు విషయంలో అబద్ధం చెప్పడం ఇష్టం లేకపోవడంతో, మహారాణికి నిజం చెప్పి ఆమెకు మరింత దగ్గరవుతాడు ఆకాశవీరుడు. అయితే, పెళ్లయిన తర్వాత ఆకాశవీరుడు తల్లి, మహారాణికీ అనేక విషయాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకానొక సందర్భంలో పెద్ద గొడవ అవ్వడంతో, మహారాణి కూతుర్ని
తీసుకుంజ్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో, మహారాణి మళ్లీ వెనక్కి తిరిగి వస్తుందా? ఆకాశవీరుడు తన భార్యను వెనక్కి తీసుకు రాగలిగాడా? లేదా, ఇందులో ఆకాశవీరుడు తల్లి, చెల్లి, బావమరిది పాత్రలేమిటి? చివరికి ఏం జరిగింది అనేది అసలు కథ.
విశ్లేషణ:
ఇది పెళ్లయిన భార్యాభర్తల మధ్య జరిగే గొడవలను ఆధారంగా చేసుకుని రాసుకున్న కథ అని, సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తేనే అర్థమయిపోతుంది. ఇక, తెలుగులో సినిమా ప్రారంభమైన వెంటనే, లీనియర్ స్క్రీన్‌ప్లే తో కాకుండా, నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లే తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ప్రస్తుతం నుంచి ఫ్లాష్‌బ్యాక్‌కి వెళ్తూ, మళ్లీ ప్రస్తుతానికి తీసుకొస్తూ ప్లాన్ చేసిన ట్రాన్సిషన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. నిజానికి, ఇది కొత్త కథ అనడానికి ఏమీ లేదు, చాలా రొటీన్ స్టోరీ. కానీ, దాన్ని తనదైన శైలిలో దర్శకుడు పండించాడు. వాస్తవానికి, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడానికి ఈ సినిమాలో ఎంతో కంటెంట్ ఉంది. అంతకుమించి, ఇప్పటి యూత్ సహా, ఇప్పుడిప్పుడే పెళ్లిళ్లు చేసుకుని చిన్న చిన్న విషయాలకి కూడా గొడవలు పడుతున్న యంగ్ జంటలకు ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. బహుశా, అందుకే తమిళంలో ఈ సినిమా అంత ఓపెనింగ్ అందుకునే ఉండవచ్చు. అయితే, ఇంత మెలోడ్రామా సినిమాలు తెలుగులో మనం ఎప్పుడో చూసేసాం కాబట్టి, తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది చెప్పలేని పరిస్థితి. అయితే, సినిమా మాత్రం వంకలు పెట్టడానికి లేదు. ఆసక్తికరంగా ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని రకాల ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. మాస్ ఆడియన్స్ కోసం ఫైట్లు, కామెడీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్లకు కామెడీతోపాటు ఒక మంచి సందేశాన్ని కూడా ఇచ్చేలా రాసుకున్నాడు దర్శకుడు. అసలు భార్యాభర్తల మధ్య ఎందుకు గొడవలు మొదలయ్యాయి? వాటిని వాళ్లు పరిష్కరించుకున్నారా? లేదా, పరిష్కారం కానీ గొడవలతో పీకల మీదకు వచ్చినప్పుడు ఆ భార్యాభర్తలు ఏం చేశారు అనే విషయాలను ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
నటీనటుల విషయానికి వస్తే:
అమ్మకు భార్యకు మధ్య నలిగే మధ్యతరగతి కుటుంబీకుడిగా విజయ్ సేతుపతి ఈ పాత్రకు సరిగ్గా సెట్ అయ్యాడు. విజయ్ సేతుపతి కాకుండా ఇంకెవరూ బాగా చేయలేరు ఏమో అనేంతలా, ఒక ఫ్రస్టేటెడ్ హస్బెండ్‌గా ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. ఇక, విజయ్ సేతుపతి భార్య పాత్రలో నిత్యా మీనన్ కూడా అంతే చక్కగా నటించింది. అయితే, ఎందుకో ఏమో తెలియదు కానీ, ఆమె కంటిన్యూటీ విషయంలో కేర్ తీసుకోలేదేమో అనిపించింది. ఇక, మిగతా పాత్రలలో నటించిన కొంతమంది తమిళ, మలయాళ నటులు అదరగొట్టారు. ఇది సినిమా కాకుండా, ఎక్కడో సీసీ కెమెరా పెట్టి భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవలను షూట్ చేశారా అనేలా తీసుకురావడంలో టీం సక్సెస్ అయింది. ఇక, టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మంచి ప్రెజెంట్ ఫీల్ తీసుకువచ్చింది. పాటలు తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సరిగ్గా సరిపోయింది. ఎడిటింగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. తెలుగు డైలాగ్స్ ఎవరు రాశారో కానీ, కొన్నిచోట్ల ఆంధ్రీకరించలేదేమో అనిపిస్తుంది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి.
ఫైనల్లీ:
ఈ సార్ మేడమ్ నవ్విస్తారు, ఏడిపిస్తారు, ఆలోచింపజేస్తూ బయటికి పంపిస్తారు.